#


Index

సగుణ భక్తులు - కుంతీ ప్రభృతులు

  పోతే ఇలాటి వ్యవహారమే గోపికలది కూడా. వారూ భగవదర్పిత సమస్త భావనలే. అయితే ఉపాధిలోనే తేడా ఇరువురికీ. వారు పురుషోపాధిలో ఉన్న దేవతలు. వీరు స్త్రీ ఉపాధులలో ఉన్న దేవ కన్యలు. కనుకనే సగుణంలో కూడా వారిది దాసభక్తి - సఖ్యభక్తి అయితే - వీరిది కామభక్తి. కామోత్కంఠత గోపికల్ అని గదా భాగవత వచనం. కామమంటే ఇక్కడ స్త్రీ పురుష సంబంధం. ఇది కేవలం లౌకికమైతే గర్హణీయం. పరమేశ్వర విషయకం కాబట్టి ప్రశంసనీయ మయింది. పరమేశ్వరు డొక్కడే వారి దృష్టిలో పురుషుడు. పూర్ణత్వమున్న వాడెవడో వాడు గదా పురుషుడంటే. అలాంటి పూర్ణత్వం భగవంతుడికి గాక మరెవరికి. కనుకనే పురుషుడైనా పురుషోత్తముడైనా వాస్తవానికా భగవానుడే. మరెవరూ కాదు. కాదు గనుకనే తమ తమ భర్తలను అత్త మామలను ఎవరినీ లెక్క చేయక ఇది లోకనింద్యమని కూడా సంకోచించక కృష్ణుని వెంటబడి పోయారా గోపికలు. పైగా ఆయనే సంకోచించి మీరేమిటిలా నామీద దాడి చేస్తున్నారు. మీకు భర్తలు లేరా, అత్తమామలులేరా, వారా గ్రహించరా, లోకులాడి పోసుకోరా, అని ప్రశ్నిస్తే కూడా భర్తలేమిటి బంధువు లేమిటి అంతా నీ స్వరూపమే గదా నీలోనే మేమీ ప్రపంచాన్నంతా చూస్తున్నప్పుడిక మాకుపాపమేమిటని సమాధానమిస్తారు. భక్తిలో ఇది పరాకాష్ఠ. దీనినే మధురభక్తి అంటారు భక్తితత్త్వ విశారదులు.

  మధురభక్తి ఏమిటి. మామూలు భక్తి కాదా ఇది. కాదు. మామూలు భక్తి పురుషులకు పురుషోత్తముడి మీద అయితే ఇది స్త్రీలకా పురుషోత్తముడి మీద. వాస్తవానికి పురుషుడొక్క పరమాత్మేనని చెప్పాము. ఆ దృష్టితో చూస్తే లోకంలో ఉన్న స్త్రీ పురుషులంతా స్త్రీలే. అయినా ఆ భావం పురుషులకు కలగటం కష్టం. వారి పురుషోపాధి వారి కడ్డం వస్తుంది. స్త్రీలకైతే అలాటి చిక్కులేదు. వారి శరీరాలు సైణాలే కాబట్టి సహజంగానే మేము స్త్రీలం. ఆయన పురుషుడు, ఆయనకు మేమధీనలమనే భావమేర్పడుతుంది. ఈ అధీన భావం లోకంలో స్త్రీకి తన పురుషుడి విషయంలో స్వాభావికమే. స్త్రీ శరీర నిర్మాణమే దానికి హేతువు. అది సహజంగానే పురుషుడి కధీనమై పోతుంది. అతనికి వశవర్తి అవుతుంది. అతని ఇచ్ఛానుసారం నడుస్తుంది. ఒదుగుతుంది. కరుగుతుంది. కలిసి పోతుంది. అనిర్వచనీయమైన ఆనందమిస్తుంది. పొందుతుంది. చివరకతడూ తాననే భేదం లేకుండా అభేదాన్నే

Page 271

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు