లేదు. విహార శయ్యాసనాదులే గాదు. ఒకరి నొకరు తన్నుతూ గుద్దుతూ కూడా మెలగుతూ వచ్చారు. పైగా అది అపచారమనుకోలేదు వారు. ఆయన మీద చూపే ఒక గొప్ప మన్ననగా భావించారు. అది యోగుల వ్యవహారం కంటే సన్నిహితమైనదట. అంటే కర్మ సమాధి యోగాలకన్నా భక్తి భావమే గొప్పది. అది ఎంత మూఢమైనా గాఢమే. అందుకే “మందులకు బాలుడగు హరి పొందుగని” రని మందులైనా వారి కతి సులభుండా భగవంతుడని చాటుతాడు.
మరి మూఢభక్తి అంటే సామాన్యమని భావించరాదు. మూఢత్వంలో కూడా అనన్య భావన అది. పరిపూర్ణ విశ్వాసమది. అలాంటి వారిని పరమాత్మ ఎప్పుడూ తప్ప జూడడు. యే యథా మా మన్నట్టు వారి ప్రపత్తికి తగినట్టే వారి నాదుకొంటాడు. ఒకనాడొక రాక్షసుడు గోగోప బాలురనందరినీ మ్రింగుతానని చెప్పి అ జగరాకారుడై దారిలో పడి ఉంటాడు. గోపబాలురది చూచి కూడా
బకునిం జంపిన కృష్ణుడుండ మనకుం బామంచు చింతింపనే టికి రా పోదము దాటి - కాకయది కౌటిల్యంబుతో మ్రింగుడున్ బకు వెంటంజను కృష్ణుచేత
అని తమలో తాము సమాధానం చెప్పుకొంటూ నిర్భయంగా వెళ్లిపోతారు. పరమాత్మ అది చూచి అయ్యో వీరు. “నిర్భయులై యెదుర్కొనిరి నే గల నంచు” అంచేత వీరి నుపేక్షింపరాదని చెప్పి దాని కడుపులో దూరి పెరిగి దాని కడుపు చించి వారిని కాపాడుతాడు. మరొక పర్యాయం బ్రహ్మదేవుడాయన మహాత్త్వాన్ని పరీక్షించటానికి గోవులనూ గోపబాలురనూ మాయం చేస్తాడు. కృష్ణుడది కనిపెట్టి ఒక ఏడాది కాలం ఆ గోపకుల వేషాలు తానే ధరించి ఎవరికీ అంతు పట్టకుండా వ్యవహరిస్తాడు. బ్రహ్మ తన చర్యకు తానే సిగ్గుపడి కాళ్లమీద పడి మన్నింపమని ప్రాధేయపడతాడు. అంతేకాదు.
ఏలా బ్రహ్మ పదంబు వేదములకున్ వీక్షింపగా రాని ని న్నీ లోకంబున నీవనాంతరము నందీ మందలో - కృష్ణయం చాలా పాది సమస్త భావములు నీయందే సమర్పించు నీ వ్రేలం దొక్కని పాద రేణువులు పై వేష్టించినం జాలదే
Page 269