#


Index

సగుణ భక్తులు - కుంతీ ప్రభృతులు

విధూత కల్మషే స్థానే విరజే నాత్మనై వహి విదురోపి పరిత్యజ్య ప్రభాసే దేహ మాత్మవాన్ కృష్ణా దేశేన తచ్చిత్తః పితృభిః స్వక్షయమ్యయౌ

  వారి పినతండ్రి విదురుడుకూడా అక్కడక్కడా తీర్థయాత్రలు చేస్తూ వచ్చి చివరకు ప్రభాసమనే తీర్థంలో మునిగి దేహత్యాగం చేస్తాడట. ఆయనను తీసుకెళ్లటానికి పితృదేవతలు వస్తారు. వారితో కలిసిపోయి యథాపూర్వంగా యమలోకంలో తన అధికార స్థానాన్ని అలంకరిస్తాడాయన.

  చూడండి. ఇక్కడ మనమొక విషయం గమనించవలసి ఉంది. కుంతి మొదలుకొని వీరంతా సగుణభక్తులేగాని నిర్గుణభక్తులు కారు. అంటే పరిపూర్ణ జ్ఞానయోగులు కాదని అర్థం. అక్కడక్కడా వారికి జ్ఞానవైరాగ్యాలు కలిగినట్టు వర్ణించినా అది సగుణమైన జ్ఞానమే. తన్మూలంగా ఏర్పడిన ప్రాపంచిక విషయ పరాఙ్ముఖత్వమే. సమ్యగ్ జ్ఞానరూపమైన అద్వైత దర్శనం కాదు. అద్వైత దర్శనమే అయితే కృష్ణాదేశమనే మాట గాని వైకుంఠ చరణాంబుజమని మాట గాని రాకూడదు. “వాసుదేవ స్సర్వమితి" అని విషయ జగత్తుతో సహా సర్వమూ తద్రూపంగానే భావించవలసినప్పుడిక కృష్ణుడేమిటి వైకుంఠుడేమిటి. అలా అంటే అది పరిచ్ఛిన్నమైన తత్త్వం. అఖండ తత్త్వం కాదు అఖండాన్ని పట్టుకొంటేనే జ్ఞానం. దానివల్లనే ముక్తి. అంతవరకూ ముక్తికి నోచుకోలేడు మానవుడు. ఎంతటి భక్తుడైనా నోచుకోలేడు. వాడు నోచుకొనేది కేవలమా మూర్తి తోడి సాయుజ్యమే. అదీ మోక్షమని ఎక్కడైనా పేర్కొంటే అది కేవలం సాపేక్షమైన మోక్షమే గాని నిరపేక్షం గాదు. ఇలాంటి సాపేక్ష ముక్తినే పడయగలిగారు పాండవులూ, విదురుడూ. దీనికి తార్కాణమొక్కటే. వారు చివరకు ధారణా ధ్యానసమాధి రూపమైన యోగమార్గంలోనే శరీర త్యాగం చేశారు. అంతేగాదు. వారు ఉత్రమణ చెంది పోయి చేరింది వారి వారి పూర్వస్థానాలేవో అవేగాని సర్వాత్మ భావం కాదు. సర్వాత్మ భావమనేది పూర్వజ్ఞానం వల్లనే పొందగలిగేది. అప్పుడు వాడి కుత్రమణా లేదు. ఎక్కడికో పోయి చేరటమూ లేదు. “నతస్య ప్రాణా ఉత్రామంతి ఇహైవ సమవనీయంతే” అని శాస్త్రం. అంచేత “ప్రేమన్ మీరలు” అని నారదుడు చెప్పినట్టుగా పాండవులది కేవలం భగవత్ప్రేమ రూపమైన సగుణభక్తే.

Page 265

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు