#


Index

సగుణ భక్తులు - కుంతీ ప్రభృతులు

అశ్వమేధాది యాగానుష్ఠానంతో పాపం నిర్మూలమై పోతుందనే మాట కూడ పాడిగాడు. అది పంకంబున పంకిల స్థలమునకూ మద్యంబున మద్య భాండంబునకూ గలిగే శుద్ధిలాంటిదేనని ఆక్షేపిస్తాడు. జీవహింసతో గూడిన యాగకర్మల చేత మానవునికి పాప బాహుళ్యమే గాని పాప నిర్ముక్తి ఎలా కలుగుతుందని ప్రశ్నిస్తాడు. వాటన్నిటికీ భీష్ముడతని కొకే ఒక సమాధానమిస్తాడు. "ఈశ్వరుండు విష్ణు డెవ్వేళ నెవ్వని కేమి సేయు పురుషుడేమి యెఱుగు నతని మాయలకు మహాత్ములు విద్వాంసు లడగి మెలగుచుందు రంధులగుచు" ఇవన్నీ నీ ప్రయోజకత్వమని భ్రాంతి పడుతున్నావు. నీకిందులో ఎలాటి కర్తృత్వమూ లేదు. అన్నీ ఆ మహాత్ముడి మాయా విలాసమే అని ప్రబోధిస్తాడు. ధర్మరాజు కప్పటినుంచీ జ్ఞానం కొంత ఒంటబట్టి ఈశ్వరాధీనుడై బ్రతుకు సాగిస్తూ పోతాడు.

  ఇంతకూ వీరందరూ మార్జార కిశోరాలే. మర్కట కిశోరాలు గారు. మార్జార కిశోరం తల్లి ఆలనా పాలనా కోరుతుంది. మర్కట కిశోరంలాగా తాను దానినంటి పట్టుకొనే ప్రయత్నం చేయదు. పైగా నామరూపాత్మకంగానే భగవత్తత్త్వాన్ని భావించటం వల్ల ఆమూర్తి ఎప్పుడూ తమతో ఉండాలనీ తమ పనులు చేసి పెడుతుండాలని కాంక్షిస్తుంటారు. తత్త్వం తెలిసి కాదది. తమ కాతత్త్వం ఉపయోగ పడుతుందని. తన్నిమిత్తంగానే ఆ ప్రేమ భావం. ఒక నిమిత్తంగా ఏర్పడిందెప్పుడూ ఆ నిమిత్తం పోతే తొలగిపోయే ప్రమాదముంది. ఇలాంటి ప్రమాదానికే గురి కావలసి వచ్చింది పాండవులు. ఉన్నట్టుండి ఒక్కసారిగా మాయమై పోయాడు పరమాత్మ. దానితో పాటు ఆయన సహకారం కూడా కరవయి పోయింది వారికి. ఇది వారికి భగవానుడు పెట్టిన పరీక్ష. ఈ రెంటికోసమే నా మీరు నన్ను ప్రేమించటం భజించటం లేక ఇవి దూరమైనా నన్ను భజించే నేర్పున్నదా మీకని మౌనంగా ఆయన వేసిన ప్రశ్న. అదే కృష్ణ నిర్యాణం.

  పాండవ నిర్యాణానికి ముందే జరిగింది కృష్ణ నిర్యాణం. వారు బ్రతికి ఉండగానే తాను పోయాడు. ఏమిటి దీనిలో అంతరార్థం. ఎప్పటికైనా వారు తెలుసుకోవాలొక రహస్యం. తానే గదా బోధించా డర్జునుడికి. "అంత వంత ఇమే దేహా - నిత్యస్యోక్తా శ్శరీరిణః" అని దేహి అయిన జీవుడే నిత్యంగాని అతడు ధరించిన దేహం నిత్యం గాదు. అది జీవుడి దేహమైనా సరే - ఈశ్వరుడి దేహమైనే సరేఅనిత్యమే. జీవుడిదంటే

Page 261

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు