#


Index

సగుణ భక్తులు - కుంతీ ప్రభృతులు

జ్ఞాపకం లేదంటున్నాడు. పైగా మరలా వినాలని కుతూహలంగా ఉందట. అతడన్నట్టు కుతూహలమే Curiosity అది. నిజమైన జిజ్ఞాసా ధారణా కాదు.

  ఇలాంటి వ్యవహారమంటేనే సరిపడదు పరమాత్మకు. అజ్ఞుడినైనా మెచ్చుతాడు గాని జ్ఞానాన్ని అభినయించే వాణ్ణి ఏ మాత్రమూ మెచ్చడీశ్వరుడు. వెంటనే ఇలా చీవాట్లు పెడతాడు. "శ్రావితస్త్వమ్ మయా గుహ్యమ్ -జ్ఞాపితశ్చ సనాతనమ్” నీకు నేనెంతో గొప్ప రహస్యాన్ని బోధించాను. పరమ సత్యాన్నే తెలియజెప్పాను. అబుద్ధ్యా నాగ్ర హీర్యత్త్వమ్ - తన్మే సుమహ దప్రియమ్

  అది నీ మనసుకు పట్టలేదంటే ఎంత బుద్ధిహీనుడవో నీవు. ఇలాటి వ్యవహారం నాకే మాత్రమూ పనికి రాదు. అసలు భగవద్గీతారంభంలో కూడా అర్జునుణ్ణి ఇలాగే చీవాట్లు పెట్టాడు. అశోచ్యా నన్వ శోచస్త్వమ్ - ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే

  నిజమైన ప్రజ్ఞ లేకున్నా ప్రజ్ఞలు పలికితే ఒప్పుకోడు భగవానుడు. జిజ్ఞాసతో విషయం తెలుసుకోటానికి ప్రయత్నించాలి మానవుడు. అదే ఆత్మోద్ధరణకు తోడ్పడేది. అప్పుడే భగవంతుడు కూడా చేయూతనిచ్చేది. కుంతిలాగే అర్జునుడి కలాటి స్తిమితత లేదు. ఇంకా అది అంతో ఇంతో ఉన్నవాడు ధర్మరాజు. కృష్ణుడి వల్ల కాకపోయినా భీష్ముడివల్ల విన్నాడతడెన్నో ధర్మాలు. భగవద్గీత అర్జునుడు వింటే తత్తుల్యమైన మోక్షధర్మాన్నే శ్రవణం చేశాడు. చేసినందుకు తగిన పరిపాకం కూడా గణించాడు.

  అయితే పామరత్వమనేది అతణ్ణి వదలలేదు. అదీ కొంచెమంటి పట్టుకొనే ఉంది. పట్టు వదలకనే

తన దేహంబునకై యనేక మృగసంతానంబు జంపించు దు ర్జను భంగిన్ గురు బాలక ద్విజ తనూజ భ్రాతృ సంఘంబుని ట్లని జంపించిన పాపకర్మునకు రాజ్యా కాంక్షికిన్ నాకుహా యనల క్షావధినైన ఘోర నరక వ్యాసంగముల్ మానునే

  అని వాపోతాడు. రణరంగంలో జరిగిన మారణ హోమమంతా తన వల్లనే జరిగిందని అతని భ్రాంతి. పైగా ధర్మయుద్ధంవల్ల రాజులకు పాపమంటదని శాస్త్రం చెప్పినా అది కేవలం సమర్థించటానికి చెప్పిన మాటేనని పొరబాటు పడతాడు

Page 260

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు