#


Index

సగుణ భక్తులు - కుంతీ ప్రభృతులు

కాపాడితేనే పరమాత్మ అవసరం, లేకుంటే అక్కరలేదనే భావానికి కొంత తావున్న దీమాటలలో. పైగా తాను చేసుకోవలసిన మోహ విచ్ఛేదం పరమాత్మ కొప్పగించట మేమిటి. సర్వవ్యాపకుడైన ఆ దేవుని తన దగ్గరే కట్టి వేసుకొనే అభిలాష ఏమిటి. సగుణంలో ఇది చాలా క్రింది స్థాయికి చెందిన ఆర్తభక్తి. కనుకనే సర్వజ్ఞుడైన పరమాత్మ ఆవిడ ఎంత దీనాలాపాలు చేస్తున్నా ఒక్క నవ్వు నవ్వి వెంటనే రథమెక్కి వెళ్లిపోయాడు. మోహం వదలించమని ఆవిడ కోరితే మోహాన్ని ఆపాదించి పోయాడు. ఆయనకు తెలుసు నావిడ మనస్తత్త్వం. దానికి తగినట్టే ఉందాయన ప్రవర్తన పిండికొద్దీ రొట్టె. “యే యథామాం ప్రపద్యంతే తాంస్త ధైవ భజామ్యహ”మని తానే గదా చెప్పాడు. మేనత్త అంతస్తుకు తగినట్టే ఉంది మేనల్లుడి వ్యవహారం.

  కుంతి అయిన తరువాత పాండవులు. ఆవిడ కుమారులే వీరు. ఆవిడ మేనల్లుడని చూస్తే వీరు బావగారనే భావం వదలకుండానే చూచారాయనను. మహా అయితే ఆయా సమయాల్లో ఆర్త త్రాణ పరాయణుడుగా భావించారు. ఒక్కొక్కప్పుడు భగవంతుడనే భావం కూడా ఉంది. లేకపోలేదు. కాని అది ఈ బాంధవ్యమనే నివురు గప్పిన నిప్పులాగా ఉండిపోయింది. జాజ్వల్య మానంగా ప్రకాశించలేదు. కనుకనే నారద మహర్షి ఒక సందర్భంలో ధర్మరాజును చూచి ఇలా అంటాడు. "ప్రేమన్ మీరలు భక్తి నేమొ నిదె చక్రింగంటిమి" ప్రేమచేత ఆచ్ఛాదితమైన భక్తేగాని అచ్చమైన భక్తి కాదట. మరి ఆ ప్రేమ తమ కన్నివిధాలా సాయపడి నంతవరకే ఉంటుంది వ్యక్తిమీద. లేకుంటే లేదు. మరి కృష్ణుడు వారికి చేసిన ఉపకారమింతా అంతా కాదు “చెలియై మేన మఱందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై మెలంగుటది నీ భాగ్యంబు రాజోత్తమా” అని ఆ నారదుడే ప్రశంసిస్తాడు. జలజాత ప్రభవాదులు కూడా చర్చించి దర్శించలేని పరమాత్మ వారికి తనకు తానే వశవర్తియై చెప్పినవీ చెప్పనివీ అన్నిపనులూ చేసి పెట్టాడు. మహాఫలాన్నే ప్రసాదించాడట వారికి. ఏమిటా మహాఫలం. మహాఫలమంటే ఇక్కడ మోక్షం గాదు. అది పరిపూర్ణ జ్ఞానంతో రావలసిందే గాని కేవల భక్తితో అదీ సవ్యాజమైన భక్తితో రాదు.

  కాబట్టి మహాఫలమంటే ఇక్కడ జీవితంలో అంతకంతకు కలిగే అభ్యుదయమే. ఉపద్రవాలన్నీ దూరం చేసి ఎనలేని ఐశ్వర్యాన్ని ప్రసాదించటమే మహాఫల సంధాయ కత్వం. అది ఎలాంటిదో ఇంతకు ముందే అభివర్ణించాము.

Page 258

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు