#


Index

సగుణ భక్తులు - కుంతీ ప్రభృతులు

దగ్గర ఉంటే చాలు. అదే వాటన్నిటికీ జవాబు చెప్పగల గొప్ప ఆయుధమని వీరికి ప్రగాఢమైన నమ్మకం. భగవానుడు చెప్పిన "అనన్యా శ్చింతయం తోమా" మ్మనే వారు వీరే.

  అయితే ఒక్క మాట మనం గుర్తుంచుకోవలసి ఉంటుంది. వీరంతా ఎంత భక్తులైనా సగుణభక్తులే ననేమాట మనం మరచిపోరాదు. అంటే అర్థం. భగవంతుణ్ణి సగుణంగానే భావిస్తారు. దర్శిస్తారు వీరు. అంతేగాని నిర్గుణంగా దర్శించరు. నిజానికి నిర్గుణమైన రూపమే భగవత్తత్త్వం. అది సర్వ వ్యాపకం. అద్వితీయం. ఆత్మరూపం. దానినిక భక్తుడు తనకు వేరుగా భజించటమూ దర్శించటమంటూ ఉండదు. భజించే దర్శించే ఉన్నాడెప్పుడో. అయితే అనాది సిద్ధమైన అజ్ఞాన దోషం వల్ల మరుగుపడటం మూలాన మరలా జ్ఞానోదయమైతే చాలు. సాక్షాత్కారమయినట్టే. సాయుజ్య మబ్బినట్లే. అప్పుడది భక్తి గాదు. జ్ఞానం. భక్తి అనే మాట వాడవలసి వస్తే అనన్య భక్తి, పరాభక్తి అని పేర్కొనవలసి ఉంటుంది. ఇది నిర్గుణం. సగుణం కాదు. ఈ నిర్గుణ భక్తిని గూర్చి దీని తరువాతి ప్రకరణంలో ప్రస్తావిస్తాము. పోతే ప్రస్తుతం మనమీ ప్రకరణంలో వర్ణిస్తున్నది దానికి పూర్వరంగమైన సగుణభక్తి. మామూలుగా మనం లోకంలో పేర్కొనే భక్తి అనే మాట ఈ సగుణానికి చెందిన భక్తి. ఇలాంటి సగుణ భక్తులైన భాగవతులెవరో - వారి భాగవత జీవితమెలాంటిదో పరిశీలిద్దాము.

  అన్నిటికంటే మొదట కుంతీదేవి వృత్తాంతం పరిశీలిస్తే మనసుకు కొంత శాంతి నిస్తుంది. ఒక ఉత్తమ వంశంలో పుట్టి జీవితంలో కష్టసుఖాలు రెండూ చవిచూచిన ఒక భారతీయ మహిళకు ప్రతీక ఈవిడ. అన్నీ ఉండి ఏదీ లేని జీవితం. పుట్టింది యాదవ వంశంలో. పెరిగింది కుంతి భోజుని ఇంట. కన్యగా ఉండే బిడ్డను కన్న దన్న దుష్కీర్తికి పాలయింది. యౌవనంలోనే భర్తను కోలుపోయింది. తరువాత కన్న కుమారులకు దూరమై వారి కపకారులైన వారి ఇంట్లోనే చాలా కాలం తలదాచుకోవలసి వచ్చింది. చివరకు తాను ప్రచ్ఛన్నంగా కన్న కుమారునికీ మిగతా కుమారులకూ పోరాటం జరుగుతూంటే వీరు ఆ వీరుణ్ణి హతమారిస్తే తీరని మనోవేదనతో కుమిలిపోయింది. ఇంత అలజడి పాలయిన జీవిత మావిడది. కనుకనే నేమో బాగా అనుభవం పండి చివరకు దాని పరిణామంగా అన్ని భావాలకూ స్వస్తి చెప్పి భక్తి భావమొక్కటే నిండిపోయింది.

Page 252

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు