#


Index

సగుణ భక్తులు - కుంతీ ప్రభృతులు

  కృష్ణ పరమాత్మ ఆమెకు మేనల్లుడే. వసుదేవుని తోడ బుట్టిందావిడ. అంచేత చిన్నప్పటి నుంచీ ఎక్కడ ఉన్నా పరమాత్మ ఆమెకు సన్నిహితుడే. అయితే ఆయన పరమాత్మ అనే భావమంత గాఢంగా లేకపోవచ్చు. అలాగని కేవలం మేనల్లుడే ననే సామాన్యభావమూ లేదు. ద్రౌపదీ వస్త్రాపహరణం దగ్గరి నుంచీ రణ సంరంభం ముగిసేదాకా తన కుమారుల నాయన ఎంత కంటికి రెప్పలా కాపాడిందీ ఆమెకు తెలుసు. అందరితోపాటు ఆయన విశ్వరూపాన్ని సభాముఖంగానే తిలకించిన ఎలానగ. అలాంటి దానికాయన భగవంతుడని తెలియక పోవటమేమిటి. చక్కగా తెలుసు. అయితే స్త్రీ స్వభావం మూలంగా కొంతా జన్మాంతర సంస్కారమంతగా లేని కారణంగా కొంతా, అంత బలంగా కుదరలేదా భక్తి భావం. కేవలమొక ఆపద్బాంధవుడైన మహాపురుషుడి లాగానే చూస్తూ వచ్చింది. చతుర్విధా భజంతేమా” మ్మన్నట్టు అందరికీ ఒకే విధమైన అధికార సంపత్తి ఉండదు. కొందరార్తులైతే కొందరు జిజ్ఞాసువులు. కొంద రర్ధార్థులైతే కొందరు జ్ఞానులు. కుంతిది ఆర్త భక్తి. అయితే జీవితంలో ఒడుదుడుకులన్నీ తిన్న తరువాత అదే జీవితాంతంలో జిజ్ఞాసగా జ్ఞానంగా పరిణమించిందావిడకు.

  ముఖ్యంగా పాండవులైదుగురు తప్ప వారి బలగాన్నంతటినీ రాత్రికి రాత్రి అంతమొందించి వారి కొడుకులను కూడా వధించి కడకు ఉత్తర గర్భానికి కూడా ఎసరు పెట్టిన అశ్వత్థామ చర్యకామె పరితపించి పోయింది. దానితో ఇక తన వంశమే విచ్ఛిన్నమవుతుందని తహతహలాడింది. అలాంటి సందర్భంలో ఎవరికీ అంతు పట్టకుండా కోడలి గర్భంలో ప్రవేశించి దారుణమైన ఆ బాణాగ్నిని రూపుమాపి గర్భస్థ శిశువును కాపాడిన కృష్ణుని చర్య తిలకిస్తే ఆయన లోకసామాన్యమైన వ్యక్తి కాదు పరమాత్మేననే భావం ఆమెకు బాగా మనసుకు నాటింది. అంతవరకూ బీజరూపంగా ఉన్న భక్తి మొలకెత్తి చిగురొత్తి పుష్పించి ఫలించి నలుదెసల పరిమళాలు గుబాళించింది. అత్తా ! వెళ్లి వస్తానని అన్నమాట మేనల్లుడి మాటగా అనిపించ లేదావిడకు. కనుమరుగైతే మరలా కనిపిస్తాడో లేదో నని దగ్గరగా వచ్చి

శ్రీకృష్ణా యదు భూషణా నరసఖా శృంగార రత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశదహనా - లోకేశ్వరా - దేవతా

Page 253

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు