#


Index

సమాధియోగులు - భీష్మాదులు

జన్మించిన సంతానం. ఆవిడ కొక్క పురుష శిశువూ, స్త్రీ శిశువూ జన్మిస్తే అందులో పురుష శిశువీ భరతుడు. పోతే ప్రథమ భార్యయందింకొక తొమ్మిది మంది కుమారులున్నారా బ్రాహ్మణుడికి జనించిన వారు. వారందరికీ ఈ సవతి కొడుకంటే చాలా చులకన. దానికి తగినట్టితడు లోక జ్ఞానమే మాత్రమూ లేని జడుడిలాగా ప్రవర్తిస్తూ ఉన్నవాడయె. కనుక ఇంకా అవహేళన వారి కితడంటే. ఇదంతా మొదటి నుంచీ కనిపెట్టి చూస్తూనే ఉన్నాడు తండ్రి. అయినా చేసేదేమీ లేక దిగులుతోనే కొంత కాలానికి కాలం సమీపించగా దివంగతుడయినాడు. భార్య ఆయనతో పాటే సహగమనం చేస్తుంది.

  తరువాత సవతి కొడుకులకు పెత్తనం వచ్చి వారీ భరతుడమాయికుడు తమ మాట కెదురు చెప్పలేడని అతణ్ణి కేవలం పరిచారకులకంటే నీచంగా ఇంటి పనులు చేయటానికే నియోగిస్తారు. అతడు కూడా ఆ పాటి కారూఢుడైన జ్ఞాని కాబట్టి 'ఉన్మత్త జడ బధిర' అని లోకులు పలుగాకులయి కేకలు వేస్తున్నా ఏ మాత్రమూ పట్టించుకోక వారి మాటలకు తగినట్లు మరుమాటలాడుతూ పరేచ్ఛా యదృచ్ఛలతో జీవితం సాగిస్తూ విష్టి వేతన యాచనలతో తనకు నియోగించిన కార్యాలలో ప్రవర్తించేవాడు. "అతుల మృష్టాన్నమైన శుష్కాన్నమైన నెద్ది వెట్టిన జిహ్వకు హితవుగానే తలచి భక్షించుగా కొండుదలచి మిగుల బ్రీతి సేయడు రుచులందు బెంపుతోడ" ద్వంద్వాతీతుడు గనుక అన్నపానాదులైన సమస్త వ్యవహారాలలోనూ ఇది హేయమిది ఉపాదేయమనే భేదదృష్టి పెట్టుకొనేవాడు కాడు.

  సవతి కొడుకు లిదంతా చూచి వీడు మహామూఢుడని భావించి చివరకతనికి క్షేత్రపాలన వృత్తి నప్పగిస్తారు. అప్పగిస్తే అతడు కాదని పెడమొగం పెట్టాడా. పెట్టటాని కతడు లోకసామాన్యుడైన మానవుడయితే గదా. నిత్య నివృత్త నిమిత్త స్వసిద్ధ విశుద్ధాను భవానంద స్వాత్మాలంబాధిగముడు. ద్వంద్వ నిమితంగా కలిగే సుఖదుఃఖాదులందు దేహాభిమాన చింతలేనివాడు. శీతోష్ణవాత వర్షాదులలో కూడ ఒక గోవృషంలాగా అనావృత శరీరుడు. స్థండిల శాయియై రజఃపటలం చేత కప్పబడి దివ్యమాణిక్యంలాగా అభివ్యక్తం కాని బ్రహ్మతేజస్సు గలవాడు. మలినాంబర పరీత కటి తటుడూ, అతి మషీలిప్త యజ్ఞోపవీతుడు. నూక తవుడు పిండి పొట్టు మాడు, ద్రబ్బెడ అని తేడా చూడనివాడు. ఇదీ అతని దృష్టి, అతని వేషం, అతని వ్యవహారం. అట్టివాడు దేనికి

Page 244

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు