#


Index

సమాధియోగులు - భీష్మాదులు

జింకపిల్ల మూర్తి. కనుకనే తదనుగుణమైన హరిణ జన్మ దాపురించింది. అయితే ఒక ధర్మసూక్ష్మముంది ఇందులో. ఎంత జన్మవచ్చినా అది కేవలమొక బాహ్యమైన కవచమే సాధకుడికి. లోపల బహు జన్మార్జితమైన సంస్కారమెక్కడికీ పోదు. "తత్రతంబుద్ధి సంయోగం లభతే పౌర్వదైహిక" మని భగవానుడు సెలవిచ్చినట్టు వెనకటి సాధనా సంస్కారమూ అప్పుడు కూడా అతణ్ణి అంటి పెట్టుకొనే ఉంటుంది. అలా కాకపోతే రెడ్డి వచ్చే మొదలెత్తుకో మన్నట్టు ఎప్పటికీ తరించే మార్గమే లేదీ జనులకు. భరతుడికి కూడా భగవదారాధన సామర్థ్యమున్నవాడు కాబట్టి తజ్జన్యమైన సంస్కార బలంతో తన పూర్వ వృత్తాంతం జ్ఞప్తికి వచ్చి “రాజ ఋషీంద్రుడటంచు బల్కగా తేజము నొంది - యాహరిణ దేహము నందలి ప్రీతి జేసినాయోజ సెడంగనే జెడితి యోగి జనంబుల లోనబేలనై" అని విలపిస్తాడు. యోగ విఘ్నంబు ప్రాప్తించి నేను మోక్షదూరుండనైతి నని నిర్వేదం చెందుతాడు. వెంటనే పులహాశ్రమానికి బయలుదేరిపోయి తనజాతి మృగాలతో చేరక ప్రారబ్ధమెప్పుడు తీరుతుందా అని కాలాన్ని ప్రతీక్షిస్తూ ఆత్మద్వితీయుడై పతిత శుష్క పర్ణాదులతో కడుపు నింపుకొంటూ తీర్ధోదకంలో మునిగి మృగదేహాన్ని విడుస్తాడు.

  అనంతరం మూడవ జన్మలో ఆ మహానుభావుడొక మహానుభావుడైన బ్రాహ్మణుడికి జన్మిస్తాడు. ఆ బ్రాహ్మణుడు శమదమ తపః స్వాధ్యాయ సంతోష తితిక్షాది సర్వలక్షణ లక్షితుడు. అలాంటి వాడికి జన్మించటం కూడా పురాకృత సుకృత ఫలమే. “శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభి జాయతే అధవా యోగినా మేవ కులేభవతి ధీమ తామ్” అని కూడా సెలవిచ్చాడు. అలాంటి యోగుల ఇండ్లలో జన్మించడం పైగా దుర్లభతరమని కూడా చాటుతున్నది శాస్త్రం. భరతుడంత మహాత్ముడు గనుకనే తన కనురూపమైన వ్యక్తిని వెతుక్కొంటూ వచ్చి అక్కడే జన్మించాడు. అక్కడ కూడా జన సాంగత్యానికి దూరంగా ఉంటూ నిరంతర భగవచ్చింతన ఏమరక లోకానికి తానొక అంధుడుగా బధిరుడుగా ఉన్మత్తుడుగా కనిపిస్తుంటాడు. "జడవ ల్లోక మాచరే”త్తని గదా సిద్ధాంతం. దాన్ని అక్షరాలా పాటిస్తూ వచ్చాడు. జడ భరతుడని లోకంలో పేరు పొందాడు. తండ్రి అతని వాలకం కనిపెట్టి యధాకాలం ఉపనయనాది సంస్కారాలు నిర్వర్తించి చదువు సంధ్యలు యధావిధిగా నేర్పుతాడు. ఇతడా బ్రాహ్మణునికి ద్వితీయ భార్యయందు

Page 243

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు