పోతే ఈ యోగమార్గంలో మనం చెప్పుకోవలసి కడపటి వ్యక్తి భరతుడు. ఆయన ఈ ఋషభుడి కుమారుడే. చూడబోతే వంశపారంపర్యంగా సంక్రమిస్తూ వచ్చిందీ యోగచర్య వీరందరికీ. భరతుడిలో అది పరిపూర్ణత నందుకొన్నది ఎందుకంటే కర్మయోగంతో ప్రారంభమై ఈయనజీవితం నడుమ సమాధి భక్తి యోగాల శిక్షణ సంపాదించి తత్పరిపాక ఫలంగా బ్రహ్మజ్ఞాన ముదయించి తద్ద్వారా చివరకు మోక్ష సామ్రాజ్యాన్నే సాధిస్తుంది. అందుకే పరిపూర్ణమైన జీవితమిది. శాస్త్ర విహితమైన కర్మలు తానాచరిస్తూ తన పలుకుబడిలో ఉండే ప్రజలందరూ ఆచరించేలాగా చూస్తూ ధార్మికంగా పాలన సాగించాడు. “ఈ జేచ భగవంతం” భగవంతుడైన నారాయణుణ్ణి ఉద్దేశించి దర్శపూర్ణమాసాది యజ్ఞయాగాల సంఖ్యాకంగా అనుష్ఠించాడు. సమస్త కర్మ ఫలమూ వాసుదేవార్పణం చేసి మృదితకషాయుడై ఆయాదేవతా శక్తులను తన శరీరావయవాలలోనే భావించి ధ్యానం చేస్తూ వచ్చాడు. ఇలా విశుద్ధ సత్త్వుడయి హృదయ పుండరీక మధ్యంలో శ్రీవత్సకౌస్తుభ వనమాలాది భూషితమైన వాసుదేవ మూర్తిని ప్రతిష్ఠించుకొని వర్తించేవాడు.
ఈ ప్రకారంగా వర్షాయుత సహస్రంబుగా రాజ్యపాలన చేసి అనంతరం హరి భక్తి బాగా పాకానబడి రాజ్యగృహ బంధుమిత్ర పరివారాదులకు స్వస్తి చెప్పి పులహాశ్రమానికి వెళ్లిపోయి అక్కడ దినదినమూ భగవదారాధన గావిస్తూ తత్పరి చర్యాభక్తి భరంబున శిథిలీకృత హృదయగ్రంథి గలిగి త్రిషవణ స్నానాలు గావించి జటాధారియై పవిత్ర కృష్ణాజినం మీద కూర్చుండి ఆదిత్య మండలాంతర్గతుండయి హిరణ్య శ్మశ్రు కేశధారి అయిన నారాయణమూర్తిని సదాభావన చేస్తూ వర్తించేవాడు. ఒకనాడా సమీపంలో ఉండే నదిలో స్నానం చేసి నదీ జలమధ్యంలో నిలుచొని ఒక ముహూర్త కాలం ప్రణవ జపం చేస్తుండగా ఒక దారుణమైన దృశ్యం కంటబడుతుంది. ఒక ఆడుజింక గర్భవతి దాహం వేసి ఆ నదిలో దిగుతుండగా కొంత దూరాన సింహగర్జన వినిపిస్తుంది. దానికి బెదరిపోయి అది మింటికి లంఘించటంలో గర్భనిర్భేదమయి అది మరణించటం గర్భస్థ శిశువు నీళ్లలో పడిపోవటం ఒక్కమారే జరిగిపోయింది. అది చూచి కరుణాళుడైన భరతుని మనసు కరగి ఆ హరిణశాబకాన్ని తెచ్చిదానికి పాలన పోషణాదులు చేయసాగాడు. క్షణ కాలమది కనపడకపోతే ఒక యుగంగా భావించేవాడు. ఒకప్పుడు కుటుంబ రాజ్యాదులు తన మార్గాని కడ్డమని
Page 241