#


Index

సమాధియోగులు - భీష్మాదులు

చివరకు. అది ప్రతిలోమమే గాని అనులోమ సాధన గాదు. భక్తి జ్ఞానాలు దాని కావశ్యకం. అవి తోడుపడితేనే అనుకూలమైన ఫలమిస్తుంది. తోడుపడకుంటే ప్రతికూలంగానే సమసిపోతుంది. శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించినా ధ్రువుడి కాభక్తి జ్ఞానాలు లేవు. భక్తే ఉంటే ధ్రువపదంగాదు. విష్ణుపదమే కోరేవాడు. జ్ఞానమే ఉంటే కడకు మోక్షపదమే కోరుకొనేవాడు. రెండూ కాదని ఒకానొక ఉన్నత స్థానమే అర్థించాడంటే అది సమాది యోగం వల్ల సాధించవలసిందేదో అదే సాధించగలిగాడు గాని అంతకన్నా ఏమీ లేదు.

  ఈ ధ్రువుడి కథ ఇక్కడికి ముగియలేదు. ఇరువది అయిదు వేల ఏండ్లు బ్రతకవలసి ఉంటే అప్పుడే ఎలా ముగుస్తుంది. ప్రారబ్ధకర్మ ప్రాబల్యమెవరూ తప్పించలేరు. తన తమ్ముడు ఉత్తముడు పెండ్లి పేరంటం లేక తనకు బాసటగా ఉండేవాడు. ఒకనాడు వాడు వేటకు పోయి హిమాలయ సమీపంలో ఒక యక్షుడి చేత హతుడయినాడు. ఆ పుత్ర దుఃఖంలో అతని తల్లి సురుచి అరణ్యంలో ఒంటరిగా తిరుగుతూ దావానలం చుట్టుముట్టి అకస్మాత్తుగా దాని కాహుతియైపోతుంది. తల్లీ తమ్ముడూ అలా మరణించటాని కంతటికీ హేతువాయక్ష కులమే గదా అనే కక్షతో ధ్రువుడా యక్షలోకం మీదికి దండయాత్ర వెళ్లుతాడు. ఇదీ ఒక హఠమే. అంతకు ముందు బాల్యంలో ఆ సవతి తల్లి సవతి తమ్ముడి మీద స్పర్ధతో అడవులు పట్టిపోయాడు. ఇప్పుడా ఇద్దరి మీదా ఎక్కడ లేని అభిమానం పొడుచుకు వచ్చి గుహ్యకులనే శిక్షించటానికి బయలుదేరుతాడు. ఏది పట్టినా వల్లమాలిన ఆగ్రహమే. ఇది ఒక భక్తుడికి గాని జ్ఞానికి గాని ఉండవలసిన లక్షణం కాదు కేవలం పట్టుదలతో సమాధియోగాన్ని సాధిస్తూ పోయే వ్యక్తికే కనుపట్టే స్వభావం. దీక్షతో ఏకాగ్రతతో ఆయా యోగసిద్ధులు సంపాదిస్తారే గాని వారు శమదమాది గుణాలకు నోచుకోలేరు. ఒకవేళ అలవడినా అది తాత్కాలికమే.

  కుబేరుని అలకా పట్టణాన్నే ముట్టడించాడు ధ్రువుడు. అసంఖ్యాకమైన యక్ష సైన్యాన్ని శస్త్రాస్త్ర జ్వాలల కెరచేశాడు. ఇంతమంది నిరపరాధులను పొట్టన పెట్టుకోటమే మాత్రమూ సహించలేకపోయాడు ఆయన తాత స్వాయంభువ మనువు. పరుగు పరగున వచ్చి తన మనుమని చూచి ఇలా అంటాడు. "అనఘా మనుకుల మునకిది యను చిత కర్మంబ యొకనికై పెక్కండిట్లనిమొన ద్రుంగిరి” “భూతహింస

Page 236

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు