దానితో లోకాలన్నీ వ్యాకులమయిపోయి ఆ పరమాత్మ ప్రత్యక్ష్యంగాక తప్పింది గాదు. అయినాడు ప్రత్యక్షం. యోగవిపాక తీవ్రమైన ధ్రువుని బుద్ధిలో తటిత్ప్రభాయితంగా ఉన్న తన మూర్తి బాహ్యంగా చూసేసరికి తక్షణం కళ్లు తెరచి ఆ బాలుడు పులకితుడై దండ నమస్కృతులాచరించి భగవత్ప్రసాద లబ్ధమైన వాక్కులతో ఆ భగవానుని పరిపరి విధాల స్తోత్రం చేస్తాడు. నిష్కాములకు నీ పాద పద్మభజనమే సర్వస్వమయినా సకాములయిన మాబోంట్లకు కూడా నీవు కామితార్థప్రదుడవు కాబట్టి నీ దర్శనం నాకు వృధాపోదని సాభిప్రాయంగా కీర్తిస్తాడు. అది కనిపెట్టి ఆ పరమేశ్వరుడు నాయనా నీ హృదయమందు మసలిన కార్యంబారూఢిగా నెఱుంగుదు. అది వొందరానిదైనా ఇస్తానని హామీ ఇస్తాడు. నీవు కోరినట్టే అనన్యాధిష్ఠితమయి ప్రళయ కాలంలో కూడా నశ్వరం కాని ప్రకాశమానమైన ధ్రువక్షితి అనే పదం నీకు ప్రసాదించాను. అయితే అది ఇప్పుడే నీకు పాకానికి రాదు. ఇరవయి ఆరు వేల సంవత్సరాలు రాజ్యమేలి ఆ తరువాత దేహపాతమైతే నీకది లభిస్తుంది పొమ్మని అంతర్ధానమవుతాడు.
చూచారా. ఇదీ అతడింత దారుణమైన తపస్సు చేసి చివరకు గడించిన ఫలం. సమాధి యోగంవల్ల మానవుడు సాధించే భూమిక ఇంతవరకే. దీనివల్ల అంతకంత కున్నతమైన యోగసిద్ధులు లభించవలసిందే గాని అన్నిటికన్నా అతీతమైన పరమపదం చేతికి రాదు. కనుకనే ధ్రువుడు తనకోరిక తీరి కూడా మనోవ్యధతో ఇంటికి మరలిపోయాడు. “అహో బత మమా నాత్మ్యమ్ మంద భాగస్య పశ్యత” నేనెంత మూఢుడనో దురదృష్టవంతుడనో గదా, “భవచ్ఛిదః పాదమూలం గత్వాయాచే యదంతవత్” జనన మరణో న్మూలనం గావించి మోక్షాన్నే ప్రసాదించే భగవంతుడు ప్రత్యక్షమయి కూడా ప్రాపంచికమైన పదవినే అర్థించాను. “దైవీమ్ మాయా ముపాశ్రిత్య” దేవతల మాయ నన్ను మోసపుచ్చింది. "ప్రసుప్త ఇవ భిన్నదృక్” దానితో ఒక స్వప్నదృక్కులాగా భేదదృష్టినే పట్టుకొని పోయాను. “తప్యే ద్వితీయే ప్యసతి భ్రాతృ భ్రాతృవ్య హృద్రుజా” వస్తుతః పరమాత్మ తప్ప మరొక అన్య పదార్దం లేకపోయినా ఉన్నట్టు భావించి తండ్రి అని తల్లి అని తమ్ముడని వారు నాకేదో ద్రోహం చేశారని అనవసరంగా భ్రాంతి పడ్డాను. నేనెంత అజ్ఞానిని, అవివేకిని అని ఎంతగానో పరితపిస్తాడు. కేవల సమాధి నిష్ఠ అనేది పట్టుకొని పోతే దాని ఫలితమిదే
Page 235