ధ్రువుడి తపశ్చర్య జ్ఞానం కోసం కాదు. మోక్షం కోసం గాదు. సకామమది. సవతి కొడుకుకు లభించిన పదవి అతనికి దుస్సహమయింది. అంతకన్నా పెద్ద పదవి నార్జించాలని ఆకాంక్ష తప్ప మరేదీ లేదతని మనసులో.
నారదుడది గమనించి మరలా పరీక్ష పెట్టాడు. నీవు తల్లి చెప్పిన యోగమార్గమే అనుసరించి సర్వేశ్వరానుగ్రహం పొందాలని చూస్తున్నావు. అది అనేక జన్మలు నిస్సంగులయి సమాధి నిష్టాగరిష్ఠులైన పెద్దలకే అంతుపట్టదు. ఫలితమీయదు. నీవనగా నెంత. పోనీ సకామంగా గాక నిష్కామంగా భజిస్తున్నావా. ఆయా కాలాల్లో కర్మానుసారిగా మనకేయే సుఖదుఃఖాదులు ప్రాప్తిస్తే వాటిని జ్ఞాని అయిన వాడు నిర్వికారమైన చిత్తంతో స్వీకరిస్తాడు. ఇలా యోగానికీ జ్ఞానానికీ రెంటికీ తప్పిన చిత్తవృత్తి ఏమిటో నాకంతు చిక్కటం లేదిది దేనికి. దీనిని వదలుకోమని ప్రబోధిస్తాడు. దానికా బాలుడు సమాధానమిస్తూ అయ్యా మీరు చెప్పింది వాస్తవమే నాకు యోగులకుండవలసిన శమదమాదులు లేవు. తీవ్ర రోష కషాయితమైన నాచిత్తంలో శాంతికి చోటు లేదు. త్రిభువనోత్కృష్టమూ అనన్యాధిష్ఠితమూ అయిన స్థానం కావాలి నాకు. అదే నా అభీష్టం. వీలైతే అలాటి పదాన్ని అందుకొనే మార్గమేదైనా ఉంటే అనుగ్రహించమని ప్రాధేయపడతాడు.
ఇది ఆ వాసుదేవ ప్రేరణేనని గ్రహించిన నారదుడా కుమారుడికి వాసుదేవ మంత్రాన్ని అప్పటికప్పుడుపదేశించి యమునా తీరంలో మధువనంలో కూచుని నిష్ఠతో ఈ మంత్రం జపిస్తూ పో భగవదనుగ్రహ పాత్రుడవవుతావని దీవించి పంపుతాడు. అలాగే పోయి ధ్రువుడా వనంలో త్రివృత్రాణాయామాదులూ, ప్రత్యాహారాదులూ అయిన యోగాభ్యాస క్రియల నవలంబించి ఏకాగ్రచిత్తంతో పురుషోత్తముణ్ణి ధ్యానిస్తూ కూచుంటాడు. "ధృత చిత్తుడు శాంతుడు, నియత పరిభాషణుడు, సుమహితాచారుడు, వర్ణిత హరి మంగళ గుణుడును, మితవన్యా శనుడునయి” మెలగుతూ వచ్చాడా బాలుడు. అంతేకాదు. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కఠోరమైన యోగదీక్షతో కాలక్షేపం చేయసాగాడు. చివరకు నేలమీద ఏకపాదంతో నిలుచొని ఘోరవీర తపమాచరిస్తాడు. ఇదంతా సమాధి యోగానికి పరాకాష్ఠ. భగవన్మూర్తి ధ్యానమనేది దాని కానుషంగికం.
Page 234