మాలిన్యాన్నంతటినీ ధారణా ధ్యాన సమాధి రూపమైన యోగాభ్యాస బలంతో క్షాళితం చేసుకొని ఎక్కడో అడుగున బడి అణగారిపోయిన ఆత్మజ్ఞాన గంగ పైకుబుకగా దానిలో మజ్జనోన్మజ్జనం చేసి పరిశుద్ధుడయి చివరకు పరమపదాన్ని భజించి ఉంటాడు. అసలు జరగటం కూడా అలాగే జరిగింది. చివరకు ప్రభాసమనే తీర్థానికి వెళ్లి అక్కడే శరీర త్యాగం చేశాడు విదురుడు. ఇలా విదురుడి జీవితం కూడా సమాధి యోగాని కుదాహరణ ప్రాయమే.
పోతే దీని తరువాత ధ్రువుడి జీవితం. విదురాదుల యోగం వేరు. ధ్రువుని యోగం వేరు సమాధి యోగంలోనే ఇతనిది మంత్రయోగం. స్వాయంభువ మనువు పుత్రుడైన ఉత్తానపాదునకు జన్మించిన వాడితడు. ఉత్తానపాదుడి కిద్దరు భార్యలు. సురుచి ఒకతి. సునీతి ఒకతి. సునీతి కొడుకు ధ్రువుడు. సురుచి కొడుకుత్తముడు. ఉత్తముణ్ణి ఒకరోజు ఒడిలో కూచోబెట్టుకొని తండ్రి ముద్దాడుతుంటే చూచాడీ కుర్రవాడు. తానూ ఒడిలో కూచోబోయాడు. కూచోనీయలేదు సురుచి. నా కడుపున బుడితే గాని నీవా భాగ్యానికి నోచుకోలేవు. కావాలంటే పోయి విష్ణువును గూర్చి తపస్సు చేయి. దేవుడు కరుణిస్తే నిన్ను నా గర్భవాసంలోనే జన్మింపజేస్తాడని మాట సామెతగా అంటుంది. ఏడుస్తూ వచ్చి ఆ మాటలు తల్లికి చెబుతాడు. సునీతి అతణ్ణి ఓదార్చి నాయనా "నిను నాడిన యా సురుచి వచనములు సత్యంబులగును. సర్వ శరణ్యుండనగల హరి చరణంబులు గను జనకుని యంక మెక్కగా దలతేనిన్” అని తానూ ఆ సురుచి మాటలే సమర్థించి పంపుతుంది.
పట్టుదల ఆ కుర్రవాడికి జన్మంతో వచ్చింది. అది హఠయోగుల కుండే హఠం లాంటిది. అది సహజంగా ఉండటంవల్లనే ఇటూ అటూ చూడక తల్లి మాటను పాటించి ఒంటరిగా అరణ్యానికి బయలుదేరాడు. దారిలో నారద మహర్షి తారసిల్లి అతనికి హస్తమస్తక సంయోగం చేస్తాడు. ఇది ఒక విధమైన యోగదీక్షా ప్రదానం. పినతల్లి ఆడిన నిష్ఠురోక్తులకు బాధ చెంది ఇంత దూరం ఒంటిగా పరుగెత్తి రావలెనా ఏమిటినీ చికీర్షితమని ప్రశ్నిస్తాడు. సాధకుడి చిత్తశుద్ధినీ యోగ్యతనూ పరీక్షించి గదా గురువైన వాడతని కేదైనా మార్గాన్ని చూపవలసింది. అలాంటి ధోరణిలోనే ప్రశ్నించాడు నారదుడు. "సపత్నీ మాతృవాగిషు క్షతంబను వ్రణంబు భగవద్ధ్యాన యోగరసాయ నంబున బాపి కొందు" నని సమాధానమిస్తాడు ధ్రువుడు. అప్పటికి
Page 233