#


Index

సమాధియోగులు - భీష్మాదులు

జీవితంలో ఇక ఏమీ లేదు. "కని యెదవో బిడ్డలనిక మనియెదవో తొంటే కంటె” అని అన్నకు చెప్పిన హితం తనకూ వర్తిస్తుంది. “దేహము నిత్యము గాదని మోహము దెగ గోసి సిద్దముని వర్తనుడై దేహము వెలువడు నరుడని" తానాయనకు చేసిన బోధ తనకూ అన్వయిస్తుంది. యోగమార్గంతో నిశ్చింతగా తానూ కన్ను మూయవచ్చు. కాని కలతచెందాడు విదురుడు. అంటే ఇంకా జ్ఞానవైరాగ్యాలు బాగా గట్టిపడలేదు. అందుకు పురాకృత కర్మవాసన లడ్డు తగులుతున్నాయి. అందుకే వారల మరణము వింత యగుచు జూడబడిన చింతా క్రాంతుడయి మనశ్శాంతి కోసం మరలా తీర్థాటనానికి బయలుదేరాడు.

  మత్స్యకురు జాంగలా లతిక్రమించి వెళ్లుతూ ఒకచోట ఎదురుగా వస్తున్న ఉద్ధవుణ్ణి చూస్తాడు. చూడగానే ఆయనను గాఢాలింగనం చేసుకొని కుశల ప్రశ్న లడిగి తన ఇష్టదైవతమైన కృష్ణుని యోగక్షేమాలు కూడా ప్రసంగవశాత్తూ ప్రశ్నిస్తాడు. ఎందుకయ్యా నీవు మీ వారినందరినీ వదలి ఇలా దేశాంతరాలు తిరుగుతున్నావని

అనుజుడు వీడన కయ తన తనయులు నను వెడల నడువ తానూరక యుం డిన ధృతరాష్ట్రుడు నరకం బున బడు నని శాపనార్ధాలు.

  పెడుతూ ఏమి చేయమంటావు. "నరలోక విడంబనమున హరి పరమపరుండు మానవాకృతితో నిద్ధర బుట్టి" మనలనందరినీ తన మాయాబలంతో మోహింప జేస్తున్నాడని బుజాలు తడువుకొంటూ సమాధానమిస్తాడు. ఇదంతా తగినంత మనోదార్థ్యం లేని లోపం. ఉద్దవుడాయన కేమని బదులు చెప్పాలో దిక్కుతోచక బాష్పవారి పూరిత లోచనుడయి క్రమంగా యదుకుల నాశమూ శ్రీకృష్ణ నిర్యాణమూ బయట పెడతాడు. అదంతా విని అపార దుఃఖ పరవశుడయి నిజయోగ సత్త్వమున దరియించగలిగాడు. కృష్ణుడు నిర్యాణం చెందే సమయంలో నీకే తత్త్వ రహస్యం బోధించి పోయాడో అది నాకు చెప్పమని ప్రాధేయపడతాడు అది నీకు మైత్రేయుడనే బ్రహ్మవేత్త నా కన్నా బాగా చెప్పగలడు. నిరంతర కృష్ణపదారవింద ధ్యానశీలుడతడు. అతణ్ణి పోయి ప్రార్ధించమని వెళ్లిపోతాడు.

Page 231

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు