#


Index

సమాధియోగులు - భీష్మాదులు

అకలుషమైన ఈ మోక్ష సాధన మార్గంలో పయనించే పాత్రల స్వరూపాలు కూడా తదనుగుణంగానే ఉండాలి. అందుకే వ్యక్తులు వారే అయినా భారతంలో లాగా కనిపించరు భాగవతంలో. వీరి తరహాయే వేరు. అది భీష్ముడి విషయంలో కొంత చూచాము. పోతే ఈ విదురిడి విషయంలో ఇంకా ఎక్కువ మార్పు కనిపిస్తుంది. అక్కడ చివరిదాకా హస్తినలోనే కాలం గడపి చివరకు గాంధారీ ధృతరాష్ట్రులతో అడవులకు పోయి అక్కడే వారితో కన్ను మూస్తాడు విదురుడు. ఇక్కడ అలాకాక తీర్థయాత్రలతోనే ముప్పాతిక జీవితం వెళ్లబుచ్చి ఉద్దవమైత్రేయాది మహనీయుల సాంగత్యంతో అనేక అధ్యాత్మిక రహస్యాలు శ్రవణం చేసి చివర కవధూత అయి ఎవరికీ చిక్కకుండా ఎక్కడికో వెళ్లిపోతాడు.

  అసలు విదురుడంటేనే అన్నీ తెలిసినవాడని అర్థం. మాండవ్యశాప ఫలంగా కాలుడే ఆ రూపంలో అవతరించాడు. శూద్రయోని సంభవుడైనా అయోనిజులైన ద్రోణాదులకు లేదా జ్ఞానం. సనత్సుజాతుని వంటి వాడాయనకు గురువంటే ఇక చెప్పేదేముంది. ఇంత జ్ఞానమున్నా కర్మవాసన లింకా ఆయనను వదలలేదు. అదే చిత్రం. దుర్యోధనాదుల కెంతో చెప్పి చూచాడు. తన మాట అతడే గాక అతని తండ్రి ధృతరాష్ట్రుడు కూడా పెడచెవిని బెట్టాడు. తన ఉనికే వారికి కంటక ప్రాయంగా ఉండటం గ్రహించాడు. తనకంతకంటేకంటక ప్రాయంగా ఉంది వారి సాంగత్యం. చిత్తశాంతి కోసం తీర్థయాత్ర బయలుదేరాడు. ఇది పూర్ణజ్ఞాని లక్షణంకాదు. జ్ఞానికెక్కడ ఉన్నా భయంలేదు. తన మాట వింటే వింటారు. లేకుంటే లేదు. తనపాటికి తానుంటాడు నిర్లిప్తంగా. విదురుడలా ఉండలేకపోవటం కర్మవాసనా ప్రాబల్యాన్ని సూచిస్తుంది.

  దేశమంతా తిరిగి మళ్లీ వచ్చాడు హస్తినాపురానికి, పాండవులప్పటికి కౌరవ సంహారం చేసి రాజ్యపాలన చేస్తుంటారు. వారు విదురుని చూడగానే ప్రాణాలు లేచి వచ్చినట్టయి ఆయనకు యథోచిత సత్కారాదులు చేసి తమ దగ్గరే ఉండమని బ్రతిమాలుతారు. అతడు ధృతరాష్ట్రుడూ గాంధారీ అరణ్యానికి వెళ్లుతుంటే వారితో పాటు తానూ బయలుదేరుతాడు. అక్కడ ఆ వృద్ధ దంపతులిద్దరూ యోగానల దగ్ధులయి పోవటం కన్నార చూచి మనసులో కలవరపడతాడు. న్యాయమైతే అంత కలత చెందనక్కరలేదు. తానూ ఆ పాటికి వృద్ధుడే. తాను చేయవలసింది కూడా

Page 230

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు