#


Index

సమాధియోగులు - భీష్మాదులు

  అయితే ఇక్కడ ఒక విశేషమేమంటే తన ప్రయత్నమెంత ఉన్నా భగవదనుగ్రహం కూడా ఉండాలి యోగసాధకుడికి. మన ప్రయత్నం మాత్రమే సరిపోదు. “ఓ మిత్యేకాక్షరమ్ బ్రహ్మ వ్యావహరన్ మామను స్మరన్” నన్ను స్మరిస్తూ కూడా ఉండాలన్నాడు భగవానుడు. ఈశ్వర ప్రణిధానమని పతంజలి పేర్కొన్నదిదే. అలాగైతేనే యోగం ఫలిస్తుంది. “ఫలమత ఉపపత్తేః" అనిగదా శాస్త్రవచనం. ఈ యోగరహస్యాన్ని బాగా గ్రహించినవాడు కాబట్టి భీష్ముడు కృష్ణుణ్ణి స్తోత్రం చేస్తూ ఆయన మూర్తినే దర్శిస్తూ ప్రాణాలు వదులుతాడు. త్రిజగన్మోహన నీలకాంతి అంటూ ఎంతో మనోహరంగా చేసిన ఆ ఈశ్వరస్తవమంతా యోగసిద్ధికొక ఆలంబనం. ఈశ్వరానుగ్రహం కోసం చేసే అభ్యర్ధనం. తదనుగ్రహ బలంతో భీష్ముడు చివరకు తన కభిమతమైన స్థానాన్నే పోయి చేరుతాడు. గీతలో చెప్పినట్టు "సతం పరం పురుషము పైతి దివ్యమ్” దివ్యమంటే సూర్యమండలాం తర్గతుడైన ద్యోతనాత్మకుడైన పురుషుడని అర్ధం చెప్పారు భాష్యకారులు. సగుణ బ్రహ్మతత్త్వమిది. నిర్గుణం కాదు. ప్రస్తుత మీభీష్ముడొక వసువు. అష్టవసువులలో అష్టమ వసువు. శాపగ్రస్తుడయి ఇలా జన్మించాడు. అతడు తన అభ్యాస బలంతో మరలా వసుపదాన్నే పొందాడే గాని మోక్షాన్ని గాదు. “సయాతి పరమాం గతిమ్” అంటే ప్రకృష్టమైన పదం లేదా స్థానమని అర్ధం. అదే యోగులు కోరేది వారిక లభించేది. అంతకన్నా ఎక్కువది రాదు. తక్కువది రాదు. ఇదీ భీష్ముడి వృత్తాంతం.

  పోతే ఇక విదురుడు. భీష్ముడూ విదురుడూ వీరిరువురూ భాగవత పాత్రలు కారసలు. భారత పాత్రలు. వారే మరలా మనకు భాగవతంలో దర్శనమిస్తున్నారు. ఇలా వీరిరువురే కాదు. కుంతీ గాంధారీ, ధృతరాష్ట్రుడూ, పాండవులూ, వీరంతా భారతంలోనే వారే. భాగవతంలోనూ కనిపిస్తున్నారు. ఇతిహాసంలో వారు పురాణంలోకి రావలసిన అవసరమేమి. దీనికింతకు ముందే ఇచ్చాము సమాధానం. పురాణ పాత్రలు కేవలం కల్పితాలే. వారొక సత్యాన్ని నిరూపించటం కోసం కల్పించబడుతారు. అందులో ఇతిహాస సత్యం ధర్మమైతే పురాణ సత్యం మోక్షమని గదా వర్ణించాము. ధర్మం ఆపేక్షికం గనుక దానిలో ప్రాపంచిక వాసనలు కూడా ప్రబలంగా ఉంటాయి. పోతే మోక్షమలాంటిది కాదది నిరపేక్షం. ప్రోజ్జిత కైతవమని గదా మొదటనే పేర్కొన్నాడు భాగవతకారుడు. కాబట్టి దానిలో కాలుష్యానికి తావులేదు

Page 229

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు