#


Index

కర్మయోగులు - దక్షాదులు

పాటికదే విజృంభించింది. అలాటి వాడిప్పుడు దాన్ని ఆదేశించటమా. అలా ఎన్నటికీ జరగదు. అట్టి స్వభావమూ కాదాయనది. అందుకే కళ్లు మూసుకొని ప్రార్ధించాడు. అంతమాత్రమే. ఆ మహనీయుడి భక్తి శ్రద్ధా తాత్పర్య భూతానుకంపాది గుణసంపత్తికి పరవశమైన ఆ చక్రం ఎంత నిర్వక్రమైనా నిజ పరాక్రమం చూపక ఉపశమనం చెందుతుంది. బ్రతుకు జీవుడా అని నిట్టూర్పు విడిచి దుర్వాసుడాయనను వీడ్కొని వెళ్లబోతాడు. కాని పోనీయ డంబరీషుడు. బ్రాహ్మణుడతిథిగా వస్తే పారణ కాహ్వానించి కూడా ఆయన నిరాహారిగానే వెళ్లిపోవటం సహించగలడా. వెంటనే ఆయనకు షడ్రషోపేతంగా భోజనం పెట్టి గాని పంపడు. ఇలాంటిదీ అంబరీషుడి ప్రవర్తన. విశుద్ధమైన ఒక కర్మయోగి జీవితమాయనది. ఈశ్వరార్పిత చిత్తవృత్తి అయినా ఏదీ కొఱత వడగూడదేదీ జరగకుండా పోగూడదు.

  పోతే ఇక ఈ మార్గంలో ఆఖరివాడు పృథుచక్రవర్తి ఉన్నాడు. ఆయనా ఈయన లాగా ఒక మహారాజే. ఈయన చంద్ర వంశీయుడైతే ఈయన సూర్యవంశీయుడు. అలాగే సక్రమంగా పరిపాలన చేసినవాడే. అయితే ఆయన జీవితమిలా ఒకే మార్గంలో నడిచింది గాదు. ఆయన కేవలం కర్మయోగి అయితే ఆయన గారిది కర్మయోగంతో ఆరంభమయి సమాధి యోగతో సమాప్తమైన జీవితం. కర్మ సమాధి యోగాలకు రెంటికీ ఒకసేతువులాగా భక్తి యోగం కూడా చోటుచేసుకొన్నది. అసలు పృథువు జన్మే చాలా చిత్రమైనది. మహర్షుల కోపాగ్ని జ్వాలల కాహుతి అయిన వేనుడి బాహువు మధిస్తే జనించిన వాడా పృథువు. అందులో దక్షిణ బాహువు మథిస్తే పృథువూ వామబాహువు మథిస్తే అర్చి అనే కన్యా జన్మిస్తారు. ఆవిడ లక్ష్మి అంశ కాబట్టి విష్ణ్వంశజుడైన ఆయన్నే పెండ్లాడింది. బాహువు మధిస్తే జన్మించిన వాడని చెప్పటం సాభిప్రాయం. బాహుబలి గదా క్షత్రియజాతి. పుట్టగానే సద్యోయౌవనుడయి శంఖచక్రాదులైన దివ్యలాంఛనాలతో దర్శనమిస్తాడు. విష్ణుదేవుని అపరావతారమని పది మందీ కీర్తిస్తారు. అలా భావించటంలో తప్పేముంది. నా విష్ణుః పృథివీ పతిః అని గదా శాస్త్రం. విష్ణువు లక్షణం ప్రజాపాలనమే గదా. అదే ఉత్తమ క్షత్రియుడి ధర్మం కూడా. కనుక అలాటి ఆదర్శప్రాయుడైన రాజు సాక్షాద్విష్ణు స్వరూపడన్నా తప్పులేదు.

Page 220

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు