#


Index

కర్మయోగులు - దక్షాదులు

దేశమేలే రాజు. దుష్యంతుని కుమారుడు భరతుడైతే భరతుడి కుమారుడు మన్యువైతే మన్యువుకు నరుడైతే - నరుడి కుమారులు గురు సంకృతులైతే - అందులో సంకృతి అనే రాజకుమారుడీ రంతి. బహుకాలం రాజ్యపాలన చేశాడు. రాచరికం చేస్తూ కూడా జనకుడిలాగా కర్మయోగి. వియద్విత్తుడని పేరాయనకు. స్వప్రయత్నం లేక మాత్రం కూడా లేకుండా ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు దైవికంగా ఎంత విత్తం లభిస్తే అంతటితో తృప్తిజెందేవాడు. సంచితమైన ధన కనక వస్తు వాహనాదులన్నీ బధిర పంగ్వంధాదులైన దీన మానవులకు పంచి ఇచ్చి ఐచ్చికంగానే అకించనుడయి పోతాడు. అలాటి దయనీయమైన దశ ననుభవిస్తూ కూడా ధైర్యం సడలక సకుటుంబంగా అక్కడక్కడా సంచరిస్తూ నలభయి ఎనిమిది రోజులు క్షుత్పిపాసలతో అలసి సొలసి చివరకొక ఏకాంత ప్రదేశంలో దైవికంగా ఘృతపాయసాది సంపన్నమైన ఆహారం పడయగలుగుతాడు.

  అది తానూ తన కుటుంబ సభ్యులూ భుజిద్దామని ఉద్యుక్తులవుతూ ఉండగా “అతిథిర్ర్బాహ్మణః కాలే భోక్తుకామస్య చాగమత్” ఒక బ్రాహ్మణుడాకలి గొని వచ్చి అన్నం పెట్టమని అడుగుతాడు. "తస్మై సంవ్యభజత్ సో న్న మాదృత్య శ్రద్ధయా న్వితః హరిమ్ సర్వత్ర సంపశ్యన్" అతడూ తానారాధించే దైవమే నని తనదైవాన్నే అతనిలో చూచినవాడై తన ఆహారంలో కొంత అతిధికిచ్చి పంపుతాడు. “అథాన్యో భోక్తు కామస్య” మరొక వృషలుడు వచ్చి యాచిస్తాడతణ్ణి అలాగే. యాచిస్తే "వ్యభజత్తస్మై వృషలాయ హరిమ్ స్మరన్” ఆ శూద్రుడికి కూడా అలాగే కొంచెమన్నం పెట్టి పంపుతాడు. “యాతే శూద్రే తమన్యోగా దతిథిః శ్వభి రావృతః" వాడు వెళ్లగానే మరొక మాలవాడు కుక్కలను వెంటబెట్టుకొని ఎక్కడి నుంచో బయలుదేరి వస్తాడు.

హీనుడ జండాలుండను మానవ కులనాథ – డప్పి మానదు - నవలం బోనేర నీకు జిక్కిన పానీయము నాకు బోసి బ్రతికింప గదే

  అని అతిదీనంగా వేడుకొంటాడు. దానికి రంతిదేవుడి హృదయం కరుణతో ద్రవించి ఇలా అంటాడు. నాయనా !

Page 210

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు