#


Index

కర్మయోగులు - దక్షాదులు

కామ బాధకు తట్టుకోలేను నన్ను నీవాణ్ణి చేసుకోమంటాడు. అంటే “అభ్యనందత తం వీరం హసంతీ వీరమోహితా" అలాగే కానీయమని అతని కోరిక అభినందిస్తుందట. అన్యోన్య తాదాత్మ్యమంటే ఇదే. దీనివల్లనే సంసారం. అదే ఇక్కడ పురంజనుడి పురప్రవేశం.

  ప్రవేశంతో సరిపోయిందా. “ఏవంకర్మసు సంయుక్తః కామాత్మా వంచితో బుధః" కామం కర్మకు దారి తీసింది. “మహిషీయ ద్యదీహేత- తత్త దేవాన్వ వర్తత” ఆవిడ ఏది కోరితే అది. సంకల్పాన్ని బట్టే గదా మన సకల వ్యావృత్తులూ, ఇలా ఉండగా ఒకనాడు రథారూఢుడై అరణ్యానికి వెళ్లాడట పురంజనుడు. అక్కడ మృగ సంతానాన్ని వేటాడాడట. చాలా అలసిపోయి మరలా కొంప చేరుతాడు. తన ప్రేయసి ఎక్కడా కంటబడలేదు. ఎంతో పరితపిస్తాడు. ఏమయిందని వారి వారి నడుగుతాడు. లోపలికి వెళ్లి చూస్తే నేలమీద పడి దొర్లుతుంటుంది. ఏమిటి విషయమని ప్రశ్నిస్తే ఒంటరిగా ఆవిడను వదలిపోవటమే ఆవిడ దైన్యానికి నిమిత్తమని గ్రహిస్తాడు. బ్రతిమాలుకొని మరలా ఆవిడతో భోగిస్తాడు. ఏమిటిందులో రహస్యం. బుద్ధిని విడిచి ఒక్క క్షణముండలేడు జీవుడు. ఒకవేళ సుషుప్త్యాది దశలలో ఉన్నా మరలా జాగ్రదాదులలో దానితో కలిసి ఉండవలసిందే. ఎప్పటికీ దూరమై పోవటమంటూ ఉండబోదు.

యుక్తేష్వేవం ప్రమత్తస్య - కుటుంబా సక్త చేతసః - ఆ ససాద సవైకాలః - చండవేగ ఇతిఖ్యాతః

  ఇలా కుటుంబ జంబాలంలో కూరుకుపోయి పరాకు చెందిన ఆ పురంజనుడి మీదికి దండెత్తి వచ్చాడు చండవేగుడనే వాడు. చండవేగం గలది కాలమే మరేదీ గాదు. దానికొక కన్యక. అది యవనేశ్వరుణ్ణి ఆశ్రయిస్తుంది. వాడికి ప్రజ్వారుడనే సోదరుడు. వీరంతా వచ్చి పురంజనుడి పురంమీద విరుచుకుపడతారట. ఇదంతా సాంకేతికమే. జరావ్యాధులే కాల కన్యాది పరివారం. “దదాహ తాం పురీం కృత్స్నామ్” ప్రజ్వారుడా పురాన్నంతా కాల్చివేశాడట. అంటే శరీరం జరావ్యాధి జర్జరితమయింది. అయ్యేసరికి న శశాకోషితుం తత్ర అందులో ఉండలేకపోతాడు పురంజనుడు.

Page 204

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు