#


Index

కర్మయోగులు - దక్షాదులు

మన శరీరమే. ఈ శరీరంలో వచ్చి ప్రవేశించిన చిదాభాసుడు జీవుడే పురంజనుడు. ఈ ఆభాసకు వెనకాల ఉండి దీన్ని కనిపెట్టి చూచే అసలు చైతన్యం ఈశ్వరుడు. రెండూ రెండు హంసలివి. ఒకటి శరీరమనే పంజరంలో ప్రవేశించింది. మరొకటి దేనిలో ప్రవేశించక అంతటా వీర విహారం చేస్తున్నది. ప్రవేశించిన చైతన్య మీ శరీరాద్యుపాధులమేరకే చిక్కి ఇదే తానని భావించి తన అసలు స్వరూపాన్ని విస్మరించింది. ఇదే ఈ హంస ఆ హంసకు దూరమై పోయిందని చెప్పటం.

  దూరం కావటానికేమిటి కారణం. "సోన్వేషమాణ శ్శరణమ్ బభ్రామ పృథివీ మిమామ్" తనకు తానే శరణమని తెలుసుకోలేక ఒక శరణ్యం కోసమని ఈ భూమికిదిగిరావటమే. నిరుపాధికమైన తత్త్వం సోపాధికంలో వచ్చి పడటం. పృథివ్యాది భూతమాత్రా సంసర్గమే ప్రమాద కారణమైనది. అందులోనూ “దదర్శ నవభిర్ద్వార్భిః పురమ్ లక్షిత లక్షణామ్" నవద్వారాలు గల పురాన్ని దర్శించాడట పురంజనుడు. ఆ పురం నవద్వారాత్మకమైన ఈ శరీరంగాక మరేముంటుంది. నవద్వారేపురేదేహే అని చాటుతుంది భగవద్గీత. అంతెందుకు. ఉపనిషత్తులే చాటాయసలు.

పురశ్చక్రే ద్విపదః పురశ్చక్రే చతుష్పదః పురస్స పక్షీ భూత్వా పురః పురుష ఆవిశత్ రెండు కాళ్ల పట్టణాలు కొన్ని, నాలుగు కాళ్లవి కొన్ని సృష్టించుకొని వాటిలో తానొక పక్షిలాగా అయి ప్రవేశించాడట పరమాత్మ. “యదృచ్ఛయా గతామ్ తత్ర దదర్శ ప్రమదోత్త మామ్” ఎవరీ ప్రమదోత్తమ. భృత్యైర్ద శభిరాయాంతీమ్ - పైగా పదిమంది సేవకులట ఆవిడ కిరువైపులా. పంచశీర్షాహినా గుప్తామ్ అయిదు తలకాయల సర్పమొకటి ఆవిడకురక్షణకల్పిస్తుందట. "అన్వేష మాణా మృషభమ్” ఆబోతులాంటి ఒక మగవాడి పొందు కోసమఱ్ఱులు సాచి వస్తుందట - ఏమిటిదంతా. ఆ ప్రమదారత్నమెవరో గాదు. మానవుడి బుద్ధి. దానికిరువైపులా ఉన్న సేవకులు పదిమందీ పది ఇంద్రియాలు. పంచశీర్షమైన పన్నగం ప్రాణాపానాది పంచవృత్తులు గల ప్రాణవాయువే. ప్రాణ సహితమైన బుద్ధి వృత్తే ఉపాధి జీవుడికి. దాని నభిమానించటం మూలాన్నే శరీరంలో బందీ అయి కూచున్నాడు.

"త్వయోప సృష్టో భగవా న్మనోభవః ప్రబాధతే 2 థాను గృహాణ శోభనే”

Page 203

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు