ఘాటుగా సమాధానమిస్తాడు. అయితే కర్మిష్ఠుడైనా ప్రాచీనబర్హి దక్షుడిలాగా కోపపడలేదు. మీదు మిక్కిలి పశ్చాత్తాపపడ్డాడు. అయ్యో ఎంత బాలిశమైన కర్మ మాచరించాను. దీనికేమిటి నిష్కృతి 'నజానామి మహాభాగ-పరం కర్మాప విద్ధధీః’ కర్మాప విద్ధ బుద్ధినై అంతకన్నా పరమమైన జ్ఞానాన్ని ఆర్జించలేక పోయాను. "బ్రూహిమే విమలమ్ జ్ఞానమ్ యేన ముచ్యేయ కర్మభిః” అమలినమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. అది ఈ కర్మ నిర్మూలనం చేసి నాకు ముక్తిని ప్రసాదిస్తుంది. “గృహేషు కూట ధర్మేషు” కూటధర్మమైన గృహస్థాశ్రమంలో పుత్ర దార ధనార్థధీః భార్య, పుత్రులూ, ధనధాన్యాలని ప్రాకులాడుతూ “నపరం విందతే మూడో భ్రామ్యన్ సంసార వర్త్మసు” అంతకు మించిన తత్త్వమేదో దాన్ని మరచి ఈ సంసార వలయం లోనే దిమ్మ దిరుగుతున్నారీ మానవులు. నాకిప్పుడు మీరు కన్నులు తెరిపించారు. ప్రవృత్తే సర్వశ్రేష్ఠమనుకొన్న నాకు నివృత్తి మార్గముపదేశించి కృతార్ధుణ్ణి చేయమని ప్రాధేయపడతాడు. చూడండి. ఇద్దరూ కర్మిష్ఠులే అయినా చెప్పినా పెడచెవిన బెట్టాడు దక్షుడు. చెప్పమని వేడుకొంటున్నాడు ప్రాచీనబర్హి, అతడికీ నారదుడే ఇతడికీ ఆ నారదుడే ఉపదేష్ట. ఒకడు కర్మమూఢుడై గురువునే ధిక్కరిస్తే మరొకడు కర్మతత్త్వ జిజ్ఞాసువై గురువు నాశ్రయిస్తాడు. లోకంలో ఉన్న అధికార తారతమ్యాన్నే ఆఖ్యాయిక మనకు నిరూపిస్తున్నది.
ఆ తరువాత నారదుడారాజు ప్రశ్నకు సమాధానంగా పురంజనోపాఖ్యానమని ఒక చక్కని ఉపాఖ్యాన మేకరువుపెడతాడు. ఇది భాగవతానికంతా మకుటాయ మానమైన కథ. కథా అనే వ్యాజంతో బ్రహ్మాండమైన ఒకసత్యాన్ని మనకు బోధించే ఒకానొక గొప్ప సంకేతం Allegory లేదా అర్థవాదం. పురాణమంతా అర్థవాదమే ననే మాట ఇక్కడ పూరా మనకు తార్కణమవుతుంది. ఎక్కడా జరిగింది చేసింది కాదిది. అప్పటిక కప్పుడా రాజుకు జ్ఞానోదయం కోసం నారదమహర్షి అల్లిన అద్భుతమైన అల్లకం. ఇది నిజంగానే జరిగిందని ఎక్కడ బోల్తాపడుతారో పడి దాని అసలైన అంతరార్థమెక్కడ విస్మరిస్తారో నని అతడే మరలా ఈ కథా సంకేతాన్నంతటినీ ఎక్కడి కక్కడ విప్పి చెప్పాడు కూడా. నిజంలో పురంజనుడూ లేడు. వాడు తన స్నేహితుడితో కలిసి రావటమూ లేదు. వాడు రాజ్యంచేసింది లేదు. బ్రతికింది లేదు. చచ్చింది లేదు. చచ్చి మరలా బ్రతికిందీ లేదు. అంతా సాంకేతికం. పురమంటే
Page 202