ప్రతి జగ్రాహతమ్ బాఢమ్ నారద స్సాధు సత్తమః ఏతావాన్ సాధువాదోయ త్తితిక్షే తేశ్వరః స్వయమ్
దక్షుడిచ్చిన శాపం మహాప్రసాదమంటూ స్వీకరించాడు. అలాటి సహనబుద్ధి నిత్యమూ కలిగి ఉండటమే భగవత్స్వరూపులైన జ్ఞానుల లక్షణమంటాడు శుకమహర్షి
దీనిని బట్టి దక్షుడికి కర్మ జడత్వమెంత ఉందో తేట పడుతుంది. తానే గాక తన సంతతి కూడా తరించటమతని కిష్టం లేదు. ప్రవృత్తి మాత్ర సంతృప్తులైన మానవుల దృక్పథానికి నిదర్శనమే ఈ కథ. వారు తాము బాగుపడరు. మరొకరిని పడనీయరు. తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లని కూచుంటారు. తమ కర్మమార్గం తప్ప దాని కతీతమైన మార్గమొకటి ఉంది దాన్ని పట్టుకొంటే గాని ముక్తి లేదనే సత్యం వారి మనసుకు పట్టదు. ఎవరైనా దాన్ని బయట పెట్టినా అర్థం చేసుకోలేరు సరిగదా కర్మభ్రష్టులని వారిని పడదిడతారు. ఇంతకూ తామే సర్వవిధాలా దక్షులని తమ మార్గమే అన్నిటికన్నా పరమోత్కృష్టమైన మార్గమంతకన్నా అనుసరణీయమైన మార్గమంటూ వేరొకటి లేనేలేదని తమ మూఢత్వాన్నే ప్రౌఢత్వంగా భావించే మేధావులు వారు. అలాంటి వారి స్వభావానికి చిహ్నంగా చెప్పిందే ఈ కథా సందర్భం.
పోతే ఈ దక్షుడికంటే కొంత మెరుగైన వాడు ప్రాచీన బర్హి, అతడొక క్షత్రియవంశజుడు. నిరంతర కర్మాసక్త చేతస్కుడు. యజ్ఞమనే నెపంతో నోరులేని ప్రాణులను కొన్ని వేల సంఖ్యలను వధించి హోమం చేశాడు. దానివలన మనకు స్వర్గభోగం ఖరారు గదా అని కలలు గంటుంటాడు. ఉన్నట్టుండి ఈ నారదుడే బయలుదేరి వస్తాడా రాజు దగ్గరికి. ప్రత్యుత్థానాదులతో సత్కరించి అయ్యా ఎక్కడ నుంచి రాక అని ప్రశ్నిస్తాడు. సరాసరి యమలోకం నుంచి అంటాడు. అక్కడ ఏమిటి వార్త అని అడుగుతాడు. అంతా నీవార్తే చెప్పుకొంటున్నారంటాడు. నా వార్త అక్కడ దేనికి వచ్చిందని ఆశ్చర్యపోతూ ప్రశ్నిస్తాడు. ఇందులో ఆశ్చర్యమేముంది. కొన్ని వేల పశులను విశసనం చేశావు గదా. "ఏతే త్వామ్ సంప్రతీక్షంతే స్మరంతో వైశసమ్ తవ” అవన్నీ నీ రాకకోసం ప్రతీక్షిస్తున్నాయి. "సంపరేత మయః కూటై శ్ఛిందంత్యుర్థిత మన్యవః” చచ్చి అక్కడికి వెళ్లావంటే ఇనుప గుదియలలాంటి కొమ్ములతో నీ కడుపులో కుమ్మి నిన్ను చిందరవందర చేయటం ఖాయం. అని
Page 201