ఇలాటి కర్మిష్ఠుల కోవలో కొందరు కనిపిస్తారు మనకు భాగవతంలో. వారిలో మొదటివాడు దక్షప్రజాపతి. ప్రజాపతి అంటేనే అసలు కర్మమార్గ ప్రవర్తకుడు. అయితే ఈ దక్షుడందులో కూడా తగ్గు స్థాయిలో ఉన్నవాడు. దక్ష అనే మాట సంకేతంగా తీసుకొంటే కర్మాచరణ దక్షుడని అర్థం చెప్పుకోవచ్చు. కర్మ తప్ప జ్ఞానమనే వాసన లేని వారంతా దక్షులే. జ్ఞానవాసన లేకనే అతడు కర్మ ఫలదాత అయిన ఈశ్వరుణ్ణి బహిష్కరించి యజ్ఞాని కుపక్రమించాడు. శివుడు సర్వేశ్వరుడని తెలియక తన అల్లుడని భ్రమించి నలుగురిలో శివదూషణ చేయటానికి కూడ వెనుదీయలేదు. శివుణ్ణి వెలివేసి చేసిన యజ్ఞం ఫలితమీయదని ఎందరు చెప్పినా వినలేదు. తుదకు జగన్మాత తన కళ్ల ఎదుట దగ్ధమవుతున్నా తనకేమీ పట్టనట్టు చూస్తూ మిన్నకున్నాడు. తన నిర్లక్ష్యానికి ఫలితంగా ఈశ్వరుని ఆగ్రహానికి గురి అయ్యాడు. అపర రుద్రుడైన వీరభద్రుడు యజ్ఞ విధ్వంసనం చేసి అతని శిరస్సు ఛేదించి "జుహావై తచ్చిరస్తస్మిన్ - దక్షిణాగ్నావ మర్షితః" దక్షిణాగ్నిలో దాన్ని హోమం చేసి వెళ్లిపోయాడు.
తరువాత ఈ వృత్తాంతం తెలిసి దక్షుని తండ్రి చతుర్ముఖుడు పోయి రుద్రుని ప్రార్ధిస్తే ఆయన మేషశీర్షం తెచ్చి అతికించమని అనుగ్రహిస్తే ప్రత్యుజ్జీవితుడై దక్షుడు తన అపచారం మన్నించమని వేడుకొంటూ ఇలా వాపోతాడు.
“యో 2 సౌ మాయా విదిత తత్త్వ దృశా సభాయామ్ క్షిప్తో దురుక్తి విశిఖై రగణయ్య తన్మామ్ అర్వా కృతంత మర్హత్తమ నిందయా పాత్ దృష్ట్యా ర్ధయా సభగవాన్ స్వకృతేన తుష్యేత్”
అసలు తత్త్వమేదో అది గ్రహించలేక నేను నా మార్గమే గొప్పదని నమ్మి మిమ్ములను దూషించాను. అయినా మీరు నన్ను చివరకు మన్నించారు. నేనెంత ధన్యుడనంటాడు. ఆ తరువాత ఆయన చేత అనుజ్ఞాతుడై మరలా యథావిధిగా యజ్ఞం చేసి పవిత్రుడవుతాడు దక్షుడు. ఇది యజ్ఞమూ గాదు. దక్షుడూ కాదు. జీవితమే ఒక దీర్ఘమైన యజ్ఞం. బాల్యాదులైన మూడు దశలూ అందులో మూడు సవనాలు. అది పరమేశ్వర ప్రీత్యర్ధమని తద్భావన సడలకుండా నిష్కామంగా నిరహంకారంగా ఆచరిస్తే ఫలితమిస్తుంది. అంటే సమ్యగ్ జ్ఞానానికి దోహదం చేస్తుంది. అలాంటి
Page 199