#


Index

కర్మయోగులు - దక్షాదులు

8.కర్మయోగులు - దక్షాదులు

మోక్ష సాధన మార్గంలో మన మింతవరకూ నాలుగు భూమికలను గూర్చి చర్చించాము. ఒకటి కర్మ, రెండు సమాధి, మూడు భక్తి, నాలుగు జ్ఞానం లేదా అనన్యభక్తి. ఇవి నాలుగూ సాక్షాత్తుగా మోక్షాన్ని ప్రసాదించవు. వీటిలో నాలుగవదైన జ్ఞానమే సాక్షాన్మోక్ష ప్రదం. అదే భాగవత పురాణ తాత్పర్యం. పరీక్షిత్తు కోరింది అదే శుకుడు బోధించింది అదే. కాబట్టి ప్రధానంగా భాగవతం ప్రతిపాదిస్తున్న మోక్షసాధనమదే. అయితే అదే ప్రధానమైనా దానికిమిగతా మూడూ ఆనుషంగికాలు Accessories అవి లేనిదే ఇది పరిపాకానికి రాదు. కాబట్టి జ్ఞాన పరిపాక హేతువులైన కారణంగా వాటినికూడా ఆయా సందర్భాలలో భాగవతం ప్రతిపాదిస్తూనే వచ్చింది. పురాణమనేది అర్ధవాదమని చెప్పాము. అర్థవాదమెప్పుడయిందో అప్పుడు చెప్పవలసిన సత్యాన్ని నగ్నంగా చెప్పటానికి లేదు. అది శాస్త్ర మర్యాద. పురాణ ప్రక్రియ గాదు. కథలు పాత్రలు వారి ప్రవృత్తులు ఇలాంటి ప్రణాళిక ద్వారా బోధించటమే పురాణ మార్గం. అందులో కర్మయోగానికి సంబంధించిన పాత్రలు వారి చరిత్రలు కొన్ని అయితే సమాధి యోగుల కథలు కొన్ని అయితే సగుణ భక్తుల వ్యవహారాలు కొన్ని అయితే నిర్గుణ భక్తులైన జ్ఞానుల గాథలు కొన్ని. ఇలా విభజించి చూస్తే భాగవత కథలు పాత్రలు వారి వ్యవహారంలోని తరతమ భావమూ మనకు బాగా బోధపడుతుంది. దీనిని బట్టి ప్రస్తుతం అన్నిటికంటే మొదటి మెట్టయినకర్మ యోగమూ దానికి సంబంధించిన భాగవత పాత్రల చరిత్ర ఎలాంటిదో పరిశీలించి చూతాము.

  అందులో కూడా కర్మయోగం వేరు. కర్మానుష్ఠానం వేరు. కేవలమిది మనకు విహితమని అనుష్ఠించేది కర్మానుష్ఠానం. అందులో ఈశ్వర భావన అంతగా లేదు. పోతే ఇది ఒకానొక ఈశ్వరుడు మనచేత చేయిస్తున్నాడు. దీని ఫలితమాయనకే అని నిర్లిప్తంగా నిష్కామంగా ఆచరిస్తే అది కర్మయోగం. దీనిలో ఈశ దృష్టి ఎక్కువ. కర్మయోగంగా పరిణమించటమే గొప్ప అసలు. అంతవరకూ మానవుడు సాధకుడు కాడు. కేవల కర్మజడుడు మాత్రమే. అలాటివాడు మోక్షమార్గంలో ఉన్నా లేనివాడే

Page 198

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు