#


Index

అనన్యభక్త

ప్రీత్యర్ధమే నని భావిస్తూ పోవాలి. పోతే ఏ పని చేసినా ఇక మనకు దాని ప్రభావం సోకదు. విక్షేపావరణ రూపమైన రజసతమస్సులు రెండూ దూరమై సత్త్వం బాగా శుద్ధమవుతుంది. దానితో మన ప్రతి కదలికలో ఆ ఈశ్వరుడే గోచరిస్తూ ఆ ఈశ్వర భావన మన ప్రతి అణువులో చోటు చేసుకొంటుంది. నాటుకొని పోతుంది. ఇది బాహ్యం కావచ్చు ఈ కర్మయోగం అభ్యంతరం కావచ్చు. బాహ్యం కేవల కర్మ యోగమైతే ఆంతరం సమాధి యోగం. రెండూ నిష్కామమే కాబట్టి సగుణమైన భక్తికి దారి తీస్తాయి. అది జ్ఞానాన్ని ప్రసాదిస్తే ఆ జ్ఞానం నిష్ఠగా సాగి అనన్య భక్తిలో పర్యవసాన మవుతుంది.

  ఏతావతా తేలిందేమిటి ఇంతకూ. కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం. మరలా భక్తియోగం. ఈ నాలుగూ మోక్షమార్గంలో నాలుగు మజిలీలు. మొదటి మూడూ పరంపరయా అయితే నాలుగవది సాక్షాత్సాధనం మోక్షానికి. అది జ్ఞానానంతరం కలిగేదైతే రెండవది జ్ఞానానికి పూర్వమేర్పడేది భక్తి. భాగవతమీ పూర్వరూపమైన భక్తినీ చెప్పినా రెండవదాని మీదనే దానికి తాత్పర్యం. మొదటి దాన్ని కేవలం దానికి ఆలంబనంగా పేర్కొన్నదని మాత్రమే మనం గ్రహించవలసి ఉంది. “అనర్థోపశమం సాక్షాద్భక్తి యోగమధోక్షజే” అనే మాట ఈ దృష్టితో చెప్పిన మాటే. అంతేకాదు. "ఇంచుక మాయ లేక మది నెప్పుడు బాయని భక్తితోడ వర్తించుచు” అన్నప్పుడు కూడ భక్తి అనే మాట అనన్యభక్తి అనే దృష్టితో వాడినదే. ఇంచుక మాయలేక అంటే అజ్ఞానమే మాత్రమూ లేనిది. అంటే సమ్యగ జ్ఞానంతో కూడుకొన్నది. పైగా మదినెప్పుడూ పాయనిది. అంటే అనన్యమైనది. జ్ఞానానంతరం అనన్యంగా కలిగేది అనన్యభక్తి గాక మరేమిటి. సగుణమైతే ఇంచుక మాయలేక ఎప్పుడూపాయని అనే మాటల కర్ణంలేదు. అంచేత ఇలాటి అనన్యభక్తినే మోక్షసాధనంగా భాగవతం లోకానికి ప్రతిపాదిస్తున్నది. అది శాస్త్రం చెప్పే జ్ఞాననిష్ఠా రూపమే గాని మరేదీ గాదు. దానికి పరంపరగా తోడ్పడే సాధనాలే కర్మయోగ భక్తియోగాలనే మొదటి రెండు భూమికలూ, ఇదీ వీటన్నిటినీ కలుపుతున్న ఏకైక సూత్రం. భాగవత మయా సందర్భాలలో ఆయా భూమికల నన్నిటినీ వర్ణిస్తూ పోతుంది. కాబట్టి ఈ సూత్రాన్ని పట్టుకొని పరామర్శిస్తే మనకది సగుణమో, నిర్గుణమో యోగమో, జ్ఞానమో, ఏ భాగవతుడి జీవితమే భూమికలో ఉందో ఎలా సాగిందో చక్కగా అవగాహనకు రాగలదు.

Page 197

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు