మహాకవి. ఆత్మ - నివేదనమని సమస్తంగా గాక ఆత్మని-వేదనమ్మని వ్యస్తం చేశాడు సమాసాన్ని. ఆత్మని అంటే ఆత్మలో - వేదనమంటే ఎఱుక అని వ్యాఖ్యానించాడు. తనలో తాను తత్త్వాన్ని గ్రహించటమని అర్థం. అది పరిపాకానికి వస్తే చింతనం. ఈ చింతనమిక సగుణం కాదు. నిర్గుణమే. సగుణాన్ని నిర్గుణం చేసే పరుసవేది మహాకవి దృష్టిలో.
పోతే ఈ నవ విధ భక్తి భూమికలలో ఒక్కొక్కరి కొక్కక్కటీ అభిమాన పాత్రం. వారి వారి చిత్త సంస్కారాన్ని బట్టి వారికదే సర్వస్వంగా భాసిస్తుంది. భాగవత పాత్రలందరూ ఈ తొమ్మిదింటిలో ఏదో ఒక దానికి చెందిన వారే. ఇందులో పాండవులది సఖ్యభక్తి. శ్రవణం పరీక్షిత్తుది. ఉద్భవుడిది గోపగోపికలది దాస్యభక్తి. బ్రహ్మేంద్రాదులది వందనం. అర్చన అంబరీషాదులది. రుక్మిణ్యాదులది సేవనం. సంకీర్తన నారదాదులది. భీష్మ విదురాదులది ఆత్మలో ఎఱుక. పోతే చింతన అనేది ప్రహ్లాద కుచేలులది. మొత్తం మీద సగుణం నుంచి నిర్గుణాన్ని అధిరోహించే సోపాన పరంపర ఈ తొమ్మిది. ఈ సగుణ నిర్గుణాల మధ్య జ్ఞానమున్నది. అది సగుణాన్ని నిర్గుణంలో కలిపే సేతువని పేర్కొన్నాము. సగుణం పాకానికి వచ్చి జ్ఞానముదయిస్తే ఆ జ్ఞానం నిరంతర చింతనతో నిర్గుణం లేదా అనన్యభక్తిగా పరిణమిస్తుంది.
అయితే ఆ సగుణభక్తి కూడా కలగాలంటే దానిపాటికది ఉట్రవడియంగా కలగదు. దానికి దగిన సత్త్వశుద్ధి, ఏకాగ్రత అలవడాలి సాధకుడికి. ఇవి రెండూ సరఫరా చేసే సాధనం కర్మయోగం. ఇది అన్నింటికన్నా మొట్టమొదటి మజిలీ మోక్షమార్గంలో. భాగవతానికి సాత్త్వత పురాణమని పేరు. సత్త్వం శుద్ధి అయినవాడే సాత్త్వతుడు శుద్ధసత్త్వమే భగవలక్షణం. అలాంటి లక్షణం భాగవతుడికి కూడా అలవడితేగాని ఆ తత్త్వాన్ని పట్టుకోలేడు. అది ఎలా అలవడుతుంది. కర్మయోగం వల్ల. కర్మయోగమంటే తను హృద్భాషలతో చేసే ప్రతి కర్మా కృష్ణార్పణ మంటూ చేయాలి. అంటే కేవలం నోటితోనే గాదు. మనసా వపుషా. త్రికరణాలతో. అది కర్తృత్వ భోక్తృత్వాలకు రెంటికీ మనలను దూరం చేస్తుంది. ఇది నేను చేస్తున్నా ననేది కర్తృత్వ బుద్ధి అయితే ఇందుకోసం చేస్తున్నా ననేది భోక్తృత్వ బుద్ధి. ఇవి రెండూ పట్టుకారులలాగా గట్టిగా పట్టుకొని ఉంటాయి మన బుద్ధులను. వీటి పట్టు వదలాలంటే నేను గాదిది ఈశ్వరుడే చేయిస్తున్నాడు. నా కోసం గాదిది ఆయన
Page 196