
నివేదనంలో పర్యవసానమవుతుంది. ఆత్మ నివేదనమంటే ఆత్మకీ ప్రపంచాన్నంతా నివేదించటమైనా కావచ్చు. లేక ఆత్మనే ఈ ప్రపంచానికీ నివేదించటం కావచ్చు. "సర్వభూతస్థ మాత్మానమ్ సర్వభూతాని చాత్మని.” అన్నిటిలో తన స్వరూపాన్ని చూడాలి. మరలా అన్నిటినీ తన స్వరూపంలోనే చూడాలి. ఉభయత్రా సమస్తమూ తన స్వరూపంగానే మారి కనిపిస్తుంది. అప్పుడు తానే ఈశ్వరుడు - ఆ ఈశ్వరుడిక తనకు భిన్నంగా ఉండబోడు. ఇలా కేవల ద్వైత బుద్ధితో ఆరంభమై కేవలాద్వైత బుద్ధితో సమాప్తమయ్యే ప్రక్రియ ఇది. ఇలా చేస్తే “తన్మన్యే 2 ధీత ముత్తమమ్” అంటాడు ప్రహ్లాదుడు.
ఇదే పోతన తన అనువాదంలో కొంత వ్యుత్ప్రమం చేసి వ్రాసినట్టు కనిపిస్తుంది.
“తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు-నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనంబను నీ తొమ్మిది భక్తిమార్గముల”
అని నడుస్తుంది పద్యం. ఇందులో నవవిధ భక్తి భూమికలూ వచ్చాయి సందేహం
లేదు. కాని స్మరణంతో గాక సఖ్యంతో మొదలయిందిక్కడ. అలాగే ఆత్మ నివేదనంతో
గాక చింతనంతో ముగిసింది. సఖ్యం భగవద్గుణ సాంగత్యమనుకొంటే ఆత్మ నివేదన
చింతన మనుకోవలసి ఉంటుంది. కాని పోతన చింతనమనేది స్మరణానికి
పర్యాయంగా తీసుకొన్నాడు. అదే ఆయన దృష్టిలో ఆఖరిమెట్టు. కనుకనే సమయం
వచ్చినపుడల్లా ప్రహ్లాద చరిత్రలో ఆ మాట పదే పదే ప్రయోగిస్తాడు. వైకుంఠ చింతా
వివర్జిత చేష్టుడై అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత - పాదపద్మ యుగళీ
చింతామృత - అడుగడ్డునకు మాధవాను చింతన ఇలా చింతా శబ్దాన్నే ఆ
ఘట్టమంతా పులిమి పుచ్చాడు. అసలాయన కాచింత ఎంతగా పట్టుకొన్నదంటే
భాగవతాని కసలింకా శ్రీకారం చుట్టాడో లేదో “శ్రీకైవల్య పదంబు జేరుటకునై
చింతించెదన్” అని తాను కూడా భగవచ్చింతనతోనే తరించాలని చూచాడా మహా
భాగవతుడు. ఇంతకూ మూలకారుడు పరమోత్కృష్ట దశగా భావించిన ఆత్మ నివేదన
మాయన దృష్టిలో నిరంతర చింతనం. అది ఆయనకు భగవద్గీత ఇచ్చిన స్ఫూర్తి
అయి ఉండవచ్చు. “అనన్యాశ్చింతయంతో మామ్" అని గదా భగద్వాణి. అంతేగాదు.
తచ్చింతనమ్ తత్కథనమని కూడా ప్రబోధమే. పోతే ఆత్మ నివేదన చింతన స్థానమెప్పు
డాక్రమించిందో ఇక ఆత్మ నివేదన కేమని అర్థం చెప్పాలా అని ఆలోచించాడు
Page 195
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు