
మహాభాగ్యం. అసలు దేవకీ వసుదేవులాయనకు తల్లిదండ్రులు కావాలనే గదా తపస్సు చేశారు. ఆ తపః ఫలమే ఆయన వారి గర్భవాసాన జన్మించటం. అదే చాలు వారు తరించటానికి. ఈ హామీ పరమాత్మే ఇచ్చాడు వారికి. పుట్టగానే చతుర్భాహువులు శంఖచక్రాలతో శ్రీమన్నారాయణమూర్తిగా సాక్షాత్కరించి వారితో ఇలా అంటాడు.
"నందను డనియుం బరమా నందంబున బ్రహ్మమనియు నను దలచుచు నా పెందెరువు నొందెదరు నా యందుల ప్రేమనిక భవము నందరు మీరల్”
నందనుడని పరబ్రహ్మమని రెండు విధాలా దర్శిస్తారట వారు. అలాగే దర్శించారు వారు జీవితాంతమూ. ఆ దర్శనమే అక్రూరాదులు కూడా అనుసరిస్తూ వచ్చారు. అక్రూరుడు, ఉద్దవుడూ, వీరుకూడా యదువంశోద్భవులే. వారు కూడా తమ బంధువనే గాక ఆ బంధుత్వంలో ఆయన జగద్బంధుత్వాన్నికూడా అనుసంధిస్తూ వచ్చారు. మరి బలరాముడాయనను నిత్యమూ అంటి పట్టుకొనే ఉన్నాడు. చివర కాయన నిర్యాణోద్యోగం ముందుగానే గ్రహించి ఆయన అనుమతితో యోగమార్గాన శరీర త్యాగం చేసిపోయాడు. పోతే కుంతి ఆయన గారి మేనత్తే గదా. ఆవిడ కూడా మొదట మొదట సంసార వాగురలో చిక్కినా చివర ఆయనలోని భగవత్తత్త్వాన్ని గుర్తించి “యాదవులందు పాండవుల యందును నీశ్వర ! నాకు మోహవిచ్ఛేదము సేయుమయ్య” అని ప్రార్ధిస్తుంది. ఘనసింధువు జేరెడి గంగ భంగి నీ పాద సరోజ చింతనముపై ననిశంబు మదీయ బుద్ధి ఉండేలాగా అనుగ్రహించమని వేడుకొంటుంది. ఇలా బంధుత్వంతో భజించారు చాలామంది.
పోతే దీని తరువాత ప్రేమ భక్తి. దీనికి పాండవులే నిదర్శనం మనకు. మనసారథి, మన సచివుడు, మనవియ్యము, మన సఖుండని ఆయన నంత ప్రీతి పాత్రుడుగా భావించారు పాండవులు. ఆయనా వారినలాగే చెలికాడ రమ్మని చీరు నొకవేళ మన్నించు నొకవేళ మఱది యనుచు అని అనేక విధాల సంప్రీతి నెరపుతూ వచ్చాడు. తండ్రి తరువాత తండ్రి యంత వాడవని ధర్మరాజే ఆయనను శ్లాఘిస్తాడు
Page 193
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు