తలిదండ్రులెవ్వరో తడవరాదు అని ఇలా పరమాత్మ నందరి ఎదుట దూషిస్తూ పోతాడు. రాక్షసులిలా పరమాత్మను దూషించటంలో ఒక చమత్కారముంది. పైకి దూషణ చేస్తున్నట్టు కనిపిస్తున్నా లోపల దిగిచూస్తే వారు పరమాత్మను దూషిస్తున్నారా లేక భూషిస్తున్నారా సందేహం కలుగుతుంది. వారి ప్రతి ఒక్క ఉపాలంభంలోనూ రెండర్థాలు ధ్వనిస్తుంటాయి. భౌతికమైన అర్థమొకటి. ఆధ్యాత్మకమైన అర్థమొకటి. ఈ శిశుపాల దూషణలోనే చూడండి. గురుదేవ శూన్యుడట. గురువూ దైవమనే భావం లేని పాపిష్ఠుడని పయి అర్థం. పరమాత్మకు గురువేమిటి దైవమేమిటని అంతరార్థం. ఇలాగే కులగోత్రాలూ, తలిదండ్రులూ లేనివాడంటే ఒక అనాథుడూ కావచ్చు. జగన్నాథుడూ కావచ్చు. వావి వర్తనములు లేనివాడట. నిజానికేకాకి అయిన దేవుడికి అవి ఎలా సంభవం. జారుడు చోరుడు ముప్పోకలాడూనట. జారుడు కాకుంటే సృష్టి లేదు. చోరుడు కాకుంటే లయం లేదు. ముప్పోకలు పోకుంటే స్థితి లేదని అర్థం.
ఇది ఒక్క శిశుపాలుడిలోనే గాదీ చమత్కారం. ప్రతి వైరభక్తుడిలోనూ కనిపిస్తుంది. రుక్మిణీదేవిని అపహరించి తీసుకెళ్ళుతున్న కృష్ణుణ్ణి అటకాయించి ఆవిడ అన్న రుక్మి ఇలా మాటాడుతాడు.
“మా సరివాడవా మా పాప గొనిపోవ నేపాటి గలవాడ వేది వంశ మెందు జన్మించితివెక్కడ బెరిగితి వెయ్యది నడవడి యెవ్వ డెఱుగు మానహీనుడ వీవు - మర్యాదలును లేవు మాయ గైకొని కాని మలయ రావు”
ఎటువంటి మాటలివి. నింద అయినదీ తెలియదు. స్తుతి అయినదీ తెలియదు. నింద అనే వ్యాజంతో సాగిన బ్రహ్మాండమైన స్తుతి. నిజంగానే పరమాత్మ మనకు సరికాడు. మనబోటి జీవకోటి కెంతైనా విలక్షణుడు. ఏపాటి ఉందాయన కేపాటీ లేదు. నిర్గుణుడు గదా. నిర్గుణుడే గాక నిరంజనుడు కూడా. అలాంటివాడికి సంగమేమిటి ? జన్మేమిటి ? నడవడి ఏమిటి. మానం మర్యాద కూడా లేదట
Page 190