#


Index

అనన్యభక్త

  హరిమీద ఆగ్రహమెక్కువయ్యే కొద్దీ ఆ హరి రూపమే కనిపిస్తూ ఉందతనికి లోపలా వెలపలా కూడా. ఏ పని చేస్తున్నా అదే చింత. ఇది సరిగా ప్రహ్లాద చరిత్రలో “పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్" అనే పద్యానికి ప్రతిరూపంగా కనిపిస్తుంది. అది అనన్యభక్తి కుదాహరణమైతే ఇది సాధ్వస రూపమైన సగుణ భక్తికి. రెంటిలోనూ ఉద్దామధ్యానమనే ధర్మం సమానమే. పోతే అది ఇంకా ముదిరి పాకానబడింది కంసుడికి. శ్రవణ రంధ్రముల నేశబ్దంబు వినబడె నది హరిమూర్తి గానోపునంచు జూచు - ఆఖరుకు తలపులెట్టివైన తలచి యా తలపులు హరి తలంపులనుచు నలుగదలచు. ఇదీ కూడా ప్రహ్లాదుని వ్యవహారంలో కనిపిస్తుంది మనకు. "కమలాక్షు నర్చించు కరముల కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ" త్వక్చక్షురాదులైన ఇంద్రియాలకేది గోచరమయినా అదంతా హరిమయంగా భావించటమనేది అక్కడా ఇక్కడా సమానమే. అయితే ముందు చెప్పినట్టు సగుణ నిర్గుణాలలోనే తేడా. ఒకటి జ్ఞానరహితమూ-మరొకటి జ్ఞానసహితము. అందుకే చివరకు మరణించే సమయంలో శిశుపాలుడి మాదిరే కంసుడు కూడా

“రోష ప్రమోద నిద్రా భాషాశన పానగతుల బాయక చక్రిన్ దోషగతి జూచియైన - వి శేష గతిం గంసు డతని జెందె నరేంద్రా”

  పరమాత్మనే చెందాడు. సదోషంగా భజించి కూడా చెందగలిగాడు. అప్పటికి తాను పరమాత్మను చెందగలిగాడే గాని పరమాత్మ అతణ్ణి చెందలేదు. పోతే మూడవది వైరభక్తి. శిశుపాల, జరాసంధ, కాలయవన, రుక్మి హిరణ్య కశిపు ప్రభృతులదంతా ఈ వైరభక్తే. పరమాత్మతో చివరదాకా శత్రుత్వమే సాధించారు వారు. శిశుపాలుడైతే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. ధర్మజుడు రాజసూయ యాగం పూర్తి చేసి యాగదక్షిణ ఎవరికివ్వాలని ఆలోచిస్తూంటే శ్రీకృష్ణుడికంటే అర్హులెవరు ఆయనకే ఇవ్వమని సలహా ఇస్తాడు సహదేవుడు. సభాసదులంతా అనుమోదిస్తారు. అందరిచేతా అనుజ్ఞాతుడై ధర్మరాజలాగే ఆచరిస్తాడు. అది చూచి శిశుపాలుడే మన్నాడో చూడండి. గురుదేవ శూన్యుండు కలుగోత్ర రహితుండు

Page 189

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు