#


Index

అనన్యభక్త

సమ్యగ్ జ్ఞానాన్ని ప్రసాదించి ఆజ్ఞానం క్రమంగా నిర్గుణభక్తిలో పర్యవసిస్తుంది. ఇలా అభ్యసిస్తూ వచ్చిన వారే గోపికాదులంతా. ప్రతి ఒక్కరూ వారిలో ఉద్దామ ధ్యానగరిష్ఠులే. అంతా ఉద్దామ ధ్యానముండబట్టే సగుణమైనా అది నిర్గుణమైన స్థితి నందుకోటానికెప్పటికైనా తోడ్పడగలదు. వారి వారి ఉద్దామ ధ్యానస్థితి నాయాఘట్టాలలో భాగవతమెంతగానో వర్ణించింది. గోపికలు కృష్ణ విరహం క్షణమాత్రం కూడా సహించలేకపోయారు. ఉన్నట్టుండి ఆయన అంతర్హితుడైతే ఆ చెట్టూ, ఈ పుట్టా పట్టుకొని వెదుకుతూ పోతారు. మరలా కనపడితే ఎక్కడ లేని ఆహ్లాదమూ పొందుతారు. ఆ పాపిష్ఠి బ్రహ్మ రాత్రి వేళ నిద్ర అనే దొకటి సృష్టించి మా కన్నులు నిన్ను చూడకుండా చేశాడిది ఎంత దుర్భరమని వాపోతారు. అక్రూరుడు వచ్చి ఆయనను మధురకు తీసుకెళ్ళుతుంటే సహించలేక అతడక్రూరుడు కాదు క్రూరుడని నానావిధాల నిందిస్తారు. తుదకు మీరిలా అర్ధరాత్రి నాతో ఒంటరిగా తిరుగుతున్నారు లోకులనుమానిస్తారని మీకు భయం లేదా అని కృష్ణుడే ప్రశ్నిస్తే అన్నింటికీ నీవుండగా మాకు భయమూ లజ్జాదేనికంటారు. ఇలాటిది గోపికల కామోత్కంఠత.

  పోతే కంసుడిది భయంతో కూడిన భక్తి. ఒక విషయంలో భయమున్న వాడికిక అదే చింతన. మనసులో అదే మెదులుతుంటుంది. అది తీరేదాకా మరచి పోడా స్వరూపాన్ని. ఇది కంసుడి ప్రవర్తనలో పదహారు కళలతో సాక్షాత్కరిస్తుంది. చెల్లెలికి గర్భం వచ్చిన క్షణంనుంచీ తనకు కాలం చెల్లిందనే భయపడుతూ వచ్చాడా కాలనేమి. ఆవిడ గర్భాన్ని చూచి “మొన్నెన్నడు నిట్లుండదు వెన్నుడు సొరనోపు గర్భవివరములోనన్” అని అప్పుడే అనుమానపడతాడు. అంతేకాదు. గర్భిణి చెల్లెలినాడు పేద నేనేమని చంపువాడనని కరుణదలుస్తాడు. దుర్భావముతో బ్రదుకుటొక్క బ్రదుకేనని తన దౌష్ట్యాన్ని తానే ఏవగించుకొంటాడు. వైరానుసంధానం చివర కన్యానుసంధానం మరచేలా చేసిందా మానవుడికి. దానితో

“తిరుగుచు గుడుచుచు ద్రావుచు నరుగుచు గుర్చుండి లేచు చనవరతంబున్ హరిఁదలచి తలచి జగమా హరి మయమని చూచె గంసుడారని యలుకన్”

Page 188

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు