గమనించాలి మనం. భక్తితో భజించటమేమిటి. భజించటమంటేనే భక్తి గదా అనిపిస్తుంది మనకు. అలా కాదని దీనిని బట్టి అర్ధమవుతూ ఉంది. భజించటమనేది భక్తితోనైనా గూడా భజించవచ్చునన్నమాట. లేకుంటే భక్తితో నని చెప్పనక్కరలేదు. ఇదే నారదుని మాటలలో కూడా అక్కడ ప్రతిధ్వనిస్తున్నది. భక్తితో భజిస్తేనే అప్పటికి వారు భగవంతుణ్ణి చెందటమూ భగవంతుడు వారిని చెందటమూ ఎడా పెడా సంభవం. అలాకాక కామాదులతో భజిస్తే ఈ భజించే వారు భగవంతుణ్ణి చెందవలసిందే గాని ఆ భగవంతుడు మరలా వీరిని చెందబోడు. చెందడన్నందుకు వారికా కామాది వాసనలు వదలకపోవటమే దాఖలా. ఏవాసనా లేనిది గదా భగవత్తత్త్వం. అది వాసనామయమైన బుద్ధిలో ఎలా ఇముడుతుంది.
దీనిని బట్టి నారదాదులది ఏ కొందరిదో అచ్చమైన నిర్గుణభక్తి అయితే మిగతా భక్తులని చెప్పుకొనే వారిదంతా నిర్గుణం కాదు. అది సగుణమైన భక్తి. నిర్గుణస్థాయి కింకా రావాలంటే దానికి జ్ఞానమనే అంతసొకటి మధ్యలో ఉంది. జ్ఞానమంటే ఏమిటి. తాను భజించే ఈశ్వరుడూ తానూ వేరు కాదు. అది తన స్వరూపమే. దానితో పాటే ఈశ్వర సృష్టి అయిన ఈ విశ్వమంతా తన స్వరూపమే అనే ఏకాత్మ భావం ఏర్పడాలి. అలాటి ఏకాత్మభావముంటే ఇక కామమనీ, భయమనీ, వైరమనీ ఇలాటి ఉపాధులుండటానికి వీలు లేదు. ఉన్నాయంటే ఇంకా జ్ఞానముదయించలేదని అర్థం. జ్ఞానమే లేకపోతే జ్ఞాన నిష్టారూపమైన అనన్యభక్తి కిక ఆస్కారమేముంది. కాబట్టి కామాది వాసనా వాసితమైన ఈ భక్తి మనం మొదట చెప్పుకొన్న నాలుగు భూమికలలో ద్వితీయ భూమికకు చెందిన సగుణ భక్తి. కనుకనే వారందరినీ ఒకశ్రేణిలో వర్ణించి చివరకు నారదుడు తనది భక్తి అనే పేరుతో వేరొక శ్రేణిలో పేర్కొనవలసిన వాడయినాడు.
అయితే ఒక్కమాట. అది సగుణమిది నిర్గుణమని పేర్కొన్న మాత్రాన మొదటి శ్రేణి అసలు పనికి రానిది నికృష్టమైనదని మరలా భావించరాదు. “మమవర్త్మాను వర్తంతే మనుష్యాః" అని భగవానుడే హామీ ఇచ్చినప్పుడు నికృష్టమనటానికి మనమెవరం. ఎటువచ్చీ జ్ఞానాత్పూర్వమైన దశ అని మాత్రమే మనం చెప్పవలసింది దాన్ని జ్ఞానాత్పూర్వం గనుకనే జ్ఞానసంపాదన కోసమది అవశ్యంగా తోడుపడుతుంది. అందుకే దాన్ని సాధకుడవశ్యంగా అభ్యసించాలి. అభ్యసిస్తూ పోతే అది వాడికి
Page 187