అయితే ఇది మోసం గదా. మోసమాయనది గాదు. ఈ భజించే జీవులది. వీరికి కామాది వాసనలు వదలకుండా భజిస్తే దానికాయన ఎలా బాధ్యుడు. ఇంకా ఆ మేరకాయన వారిని మన్నించి ఏదో ఒక రూపంతో అనుగ్రహిస్తున్నాడని సంతోషించాలి మనం. అందుకే ఆయన అంటున్నాడు “మమవర్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః” ఏ నెపమైతే నేమి ఏదో ఒక నెపంతో నా మార్గంలో నడుస్తున్నారు మానవులదే చాలు నాకు పొమ్మంటున్నాడు.
అయితే ఆ హరిని అందరూ చూడవచ్చు చెందవచ్చునని సరి సమానంగానే వర్ణిస్తున్నారే అదేమిటి. వాస్తవమే. అందరూ చూస్తారు. అయితే తమ చూపు కనుగుణంగానే చూస్తారు. తమ తాకతు కనుగుణంగనే చెందుతారు. చూడవలసినట్టు చూడరు. చెందవలసినట్టు చెందరు. అంతేగాదు. వీరాయనను చెందుతారే గాని ఆయన వీరిని చెందటం లేదు. శిశుపాలుడి జీవకళ పోయి ఆయనలో ప్రవేశిస్తే ప్రవేశించవచ్చు. అంతమాత్రాన శిశుపాలుడిలో ఆ భగవత్తత్త్వముందని గాదు. ఉండటానికక్కడ వైరమనే వ్యాజమొకటి ఉంది. అది అడ్డు పడుతోంది. అలాగే కామాదులడ్డు తగులుతున్నాయి. అలాటి ఉపాధులతో కూడి ఉన్నంతవరకూ నిరుపాధికమైన తత్త్వాని కక్కడ చోటులేదు. “యాథా శుద్ధే శుద్ధ మాసిక్త” మన్నట్టు సకలోపాధి వర్జితమైన భావనలోనే సంపూర్ణంగా ప్రతిఫలిస్తుందా భగవత్తత్త్వం. ఈ సత్యానికి భగవద్గీతలో మనకు చక్కని సాక్ష్యం లభిస్తుంది.
“సమోహం సర్వభూతేషు - నమే ద్వేష్యో స్తిన ప్రియః యే భజంతితుమామ్ భక్త్యా - మయితే తేషు చాప్యహమ్”
ప్రాణులందరూ నాకు సమానులే. వారిలో ఒకడు నాకిష్టుడనీ ఒకడనిష్టుడనీ పక్షపాతం లేదు. అయితే వచ్చిన ఇబ్బంది ఏమంటే నాకు లేకపోయినా నన్ను భజించే జీవులకుందా భేదభావం. అందరూ ఒకలాగా భజించటం లేదు నన్ను. కొందరు కామంతో కొందరు ద్వేషంతో ఇలా ఏదో ఒక ఛలంతోనే భజిస్తుంటారు. అలాటివారు నాలో ఉండవలసిందే గాని నేను వారిలో ఉండబోను. అయితే ఎవరిలో ఉంటావు నీవని అడుగుతావేమో. ఎవరు నన్ను భక్తితో భజిస్తారో వారు నాలోనూ ఉంటారు. నేను వారిలోనూ ఉంటానంటాడు. ఇక్కడ భక్తితో భజించటమనేది
Page 186