#


Index

అనన్యభక్త

ఇది బాహ్యంగా మనకు తోచే భావం. కానీ ఇది కాదీ పద్యభావం. అందరూ భగవంతుని భజిస్తున్నారని చెప్పినా ఆ భజించటం భక్తితో గాదు. భక్తితోనే అయితే “భక్తి మేము” అని నారదుడి విషయంలో మాత్రమే భక్తితో అని ప్రయోగించనక్కర లేదు. నారదుడు భక్తితో భజిస్తున్నాడంటే అప్పటికి మిగతా వారు భజించటం భక్తితో కాదని చెప్పకుండా చెబుతున్నాడు పురాణకర్త. అయితే భక్తితోగాక వారిక దేనితో భజిస్తున్నారా పరమాత్మను దేనితో భజిస్తున్నారని ప్రశ్నేముంది. కంఠోక్తిగానే చెబుతున్నాడు దేనితోనో. కామంతో గోపికలు, భయంతో కంసుడూ, వైరంతో శిశుపాలాదులూ, బంధుత్వంతో కొందరూ, ప్రేమభావంతో కొందరూ నని. పైగా భక్తితో మేము అని నారదుడు చెప్పటం చూస్తే నారదుడి దొక్కడిదే భక్తి అని మిగతా వారిది కాదని స్పష్టంగానే తెలిసిపోతున్నది. అంటే వారంతా కామాదులతో భజిస్తున్నారే గాని నారదుడిలాగా భక్తితో గాదు. భక్తితోనే అయితే అది పరిశుద్ధమైన భావంతో భజించటమయ్యేది. మరి కామంతో వైరంతో నని ఎప్పుడు వర్ణించారో అప్పుడది పరిశుద్ధమైనది కావటానికి లేదు. కామాది వాసనలతో కూడిన సగుణభక్తి. ఆ వాసనల కనురూపమైన రూపాన్నే దర్శిస్తున్నారు వారు. వాసనా రహితంగా చూడటం లేదు. దీనిని బట్టి ఎవరిదీ కూడా పరిశుద్ధమైన అనన్యభక్తి కాదు. గోపికలది సకామ భక్తి. కంసుడిది సాధ్వసభక్తి. శిశుపాలాదులది వైరభక్తి. యాదవులది బాంధవ్యభక్తి. పాండవులది స్నేహభక్తి. పోతే ఇలాటి కామాది కాలుష్యమే కొంచెమూ లేని నిష్కల్మషమైన - నిర్గుణమైన అనన్యభక్తి ఒక్క నారదుడిదే.

  అయితే ఎవరెలా భజించినా ప్రతి ఒక్కరూ ఆయనను దర్శించారనీ, చెందుతున్నారనీ వర్ణించారే దాని కేమిటర్ధమని అడగవచ్చు. ఆ దర్శించటం పొందటం కూడా వారి వారి దృష్టి భేదాన్ని బట్టి. భగవానుడే సెలవిచ్చాడు. “యే యథామామ్ ప్రపద్యంతే తాంస్త థైవ భజామ్యహమ్” ఎవరెవరు నన్నెలా భావిస్తారో వారిని నేనలాగే భజిస్తానని. అంటే ఏమని అర్థం. కామంతో చూస్తే కాముకుడు గానే కనిపిస్తాను. భయంతో చూస్తే భయానకంగానే దర్శనమిస్తాను. వైరబుద్ధితో భావిస్తే బద్ధవైరిగానే భాసిస్తాను. ఇలా ఏ రూపంతో నన్ను పట్టుకొంటే నేను వారికా రూపంగానే దర్శనమిస్తానంటాడు. ఇంద్రో మాయాభిః పురురూప ఈయతే- అని మహామాయుడైన ఆ భగవానుడే రూపాన్ని ధరించి కనిపించినా కనిపించవచ్చు. ఆశ్చర్యం లేదు

Page 185

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు