ఇప్పుడు మనకు భాగవతం భక్తితత్త్వాన్ని ప్రతిపాదిస్తున్నదంటే అది ఈ రెండింటిలో ఏదని. పరీక్షిత్తు కోరిందీ శుకుడాయనకు బోధించిందీ మోక్షసాధనమైన భక్తి కాబట్టి అది ఈ అనన్యభక్తే. మరొకటి కాదు. కాని భాగవత తాత్పర్యమదే అయినా సగుణభక్తి కూడా జ్ఞానోత్పత్తి ద్వారా దానికే చివరకు తోడ్పడుతుంది. కాబట్టి ఆయా భాగవతుల చరిత్రను వర్ణించినప్పుడిదీ అదీ రెండూ ఏకం చేసి ఏది ఏదయిందీ తెలియక ఆకులపడుతున్నారు. ఇలాటి అకులీ భావం పూర్వం ధర్మరాజాదులకే ఉందా అని తోస్తుంది పురాణరచనా ధోరణిని బట్టి చూస్తే. శిశుపాలుణ్ణి కృష్ణుడు సభామధ్యంలోనే సంహరిస్తాడు. అప్పుడు వాడి శరీరంలో నుంచి ఒక తేజస్సు బయటికి వచ్చి నేరుగా భగవానుడి శరీరంలో పోయి ప్రవేశిస్తుంది. ఇది సభాసదులందరూ విస్తుపోయి చూస్తుంటారు. ధర్మరాజు కూడా అది చూచి ఆశ్చర్యపడి ప్రక్కనున్న నారదుని భుజం తట్టి అయ్యా వీడు చూస్తే పరమ దుర్మార్గుడు. నిత్యమూ భగవద్దూషణమే ధ్యేయంగా పెట్టుకొని బ్రతికినవాడు. ఇలాంటివాడు ఆయన చేత వధింపబడటమేమిటి మరలా ఆయనలోనే వాడి జీవశక్తి ప్రవేశించట మేమిటి. అంతటి అదృష్టం పట్టటానికి వాడు చేసిన మహాపుణ్య మేమున్నదని అని నర్మగర్భంగా మాటాడుతున్నారు. దానికి సమాధానమిస్తూ నారదుడిలా అంటాడు.
“కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు – వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్యనృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేమునిదె చక్రింగంటి - మెట్లైన - ను ద్దామ ధ్యానగరిష్ఠుడైన హరి జెందన్ వచ్చు ధాత్రీశ్వరా”
ఇది బంగారంవంటి పద్యం దీనిలో ఎంతైనా అర్థముంది. పైకి బాగా అర్ధమవుతున్నట్టు కనిపించినా ఏ మాత్రమూ అర్ధం కాని పద్యమిది. పైకి మనందరికీ అర్ధమయ్యేదేమిటి. అందరూ ఆ పరమాత్మను భజిస్తూనే ఉన్నారు. అందులో కొందరు కామంతో, కొందరు భయంతో, కొందరు వైరంతో, కొందరు బాంధవ్యంతో, కొందరు ప్రేమతో, పోతే కొందరు భక్తితో. ఎవరెలా భజించినా సరే. ప్రగాఢమైన ధ్యానమనే గుణముంటే చాలు. ఆ భగవంతుని దర్శించనూ వచ్చు. ఆయన సాయుజ్యాన్ని పడయనూవచ్చు. కేవలం భజన మార్గంలోనే తేడా అని ఫలసిద్ధిలో ఎలాటి తేడా లేదు. అందరికీ వచ్చేది సాయుజ్యమే.
Page 184