అయితే ఇక్కడ వచ్చిన పెద్ద చిక్కేమంటే భక్తి అని దానికి పేరు పెట్టటం. ఆ పేరు చూచి అది జ్ఞానం కంటే విభిన్నమైనదేమోనని చాలామంది భ్రాంతి పడుతున్నారు. అంతేకాదు. భక్తియోగమనే రెండవ భూమికనూ అనన్యభక్తి అనే ఈ నాలుగవ భూమికనూ రెంటినీ ఒకటిగా భావించి భ్రమ చెందుతున్నారు. రెండు చోట్లా భక్తి అనే మాట కనపడటం వల్ల రెండూ ఒకటేనని బోల్తా పడటాని కాస్పదమయింది. ఇక్కడే అప్రమత్తంగా ఉండాలి మనం భక్తి యోగంలో చెప్పిన భక్తి - అనన్యభక్తిలో చెప్పిన భక్తి రెండూ ఒకటి కావు. అది వేరు. ఇది వేరు. అది సగుణం. ఇది నిర్గుణం. అది జ్ఞానానికి పూర్వం. ఇది జ్ఞానాని కనంతరం. జ్ఞానమింకా ఉదయించక పూర్వం జ్ఞానం కోసమవలంబించేదది. అందులో సర్వమూ ఆత్మ స్వరూపమనే జ్ఞానం లేదు. భక్తుడి స్వరూపం కంటే భగవంతుడి స్వరూపం వేరక్కడ. అది సర్వవ్యాపకమూ సర్వాత్మకమూ అయినా అనన్యంగా కనపడదు వాడికి. కేవలం సగుణంగానే భాసిస్తుంది. అది కొంత కాలమలా అభ్యసిస్తూ పోతే సర్వమూ నా స్వరూపమేననే జ్ఞానముదయిస్తుంది సాధకుడికి. అలా ఉదయించిన జ్ఞానమప్పుడే గట్టిపడదు. దీపంలాగా వెలుగుతూ ఆరుతూ ఉంటుంది. దానికి కారణమింకా పూర్వ వాసనలు సాధకుణ్ణి విడవకుండా పట్టుకొని ఉండటమైనా కావచ్చు. లేక అసంభావనాది దోషాలైన కావచ్చు. అది తొలగాలంటే ఆ కలిగిన జ్ఞానదృష్టిని అలాగే పొడిగించుకొంటూ పోవాలి జ్ఞాన సంతాన కరణమని పేరు పెట్టారు దీనికి భగవత్పాదులు. జ్ఞాన నిష్ఠ అన్నా అనన్యభక్తి అన్నా కూడా ఇదే. ఇది జ్ఞానానంతరం కలిగే దశ. కాబట్టి జ్ఞానం కన్నా కూడా గొప్పదిది. భక్తి జ్ఞానం కన్నా శ్రేష్ఠమని భాగవతం చాటిందంటే ఈ దృష్టితో. భక్తి అంటే సగుణ భక్తి ఉంది. నిర్గుణ భక్తీ ఉంది. నిర్గుణ భక్తే జ్ఞానం కంటే శ్రేష్ఠమైనది. సగుణభక్తి కాదు. సగుణభక్తి జ్ఞానానికి పూర్వరంగం. నిర్గుణభక్తి లేదా అనన్యభక్తి అనేది జ్ఞానానికి ఫలసిద్ధి. సగుణభక్తి జ్ఞానమనే పుటంలోపడి పాకానికి వస్తే అది నిర్గుణ భక్తిగా మారుతుంది. అంటే ఏమన్నమాట. భక్తీ, జ్ఞానం, భక్తి ఇదీ వరస. ఇందులో మొదటి భక్తి మామూలు భక్తి. అందులో సగుణ జ్ఞానముందే గాని నిర్గుణ జ్ఞానం లేదు. అంచేత అది జ్ఞానంకన్నా లొచ్చు. పోతే అది జ్ఞానాన్ని కలిగిస్తే ఆ జ్ఞానం నిరంతరాభ్యాసం వల్ల నిలిస్తే అది జ్ఞాననిష్ఠ-నిర్గుణభక్తి లేదా అనన్యభక్తి. ఇది జ్ఞానానికి పరిపూర్ణత కాబట్టి మామూలు జ్ఞానం కన్నా హెచ్చు. ఇదీ భక్తిని గురించి మనమర్ధం చేసుకోవలసిన తీరు
Page 183