దోషాల మూలంగా ఆ కలిగిన జ్ఞానం మరుగుపడే ప్రమాదముంది. దానితో “మలిన చిత్తేషు” మలీ మస మనస్కులైన వారికి “పరోక్ష మివ భవతీతి” అది పరోక్షమే అయిపోతుంది. “నపరోక్షం సంసార భ్రమ నివృత్తి సమర్థమ్" అటువంటి పరోక్షజ్ఞానం సంసార భ్రాంతి నివారకం కానేరదు. అంటే మోక్షఫలాన్ని ప్రసాదించలేదని భావం. మోక్షఫలాన్నే ప్రసాదించాలంటే జ్ఞానమెప్పటికీ అలాగే నిలిచి ఉండాలి. అదే భాగవతం పేర్కొనే అనన్యభక్తి.
అనన్యభక్తి అన్నా, పరాభక్తి అన్నా, విశుద్ధభక్తి అన్నా ఒక్కటే. తీవ్రమనీ ఊర్జితమని కూడా భాగవతం దీన్ని వ్యవహరించింది. భగవద్గీత దీనిని పరాఅనన్య, విశుద్ధ అని పేర్కొన్నది. అంతేగాక ఏకభక్తి అని కూడా వర్ణించింది. చతుర్విధా భజం తేమామ్ నన్ను నాలుగు రకాలవారు భజిస్తున్నారు. ఉదారా స్సర్వ ఏవైతే ఆర్తాదులైన ఈ నాలుగు తెగలవారూ నాకు భక్తులే. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తి ర్వి శిష్యతే అయితే వారిలో జ్ఞాని అనే నాలుగవ వాడు అందరికన్నా విశిష్టుడు. ఎందుకంటే వాడు ఏకభక్తి. అంటే ఏమన్నమాట. అందరిదీ భక్తి అయినా జ్ఞానిదే నిజమైన భక్తి. దీనిని తరువాత వ్యాఖ్యానం చేస్తూ భగవత్పాదులిలా సెలవిచ్చారు. సేయమ్ జ్ఞాననిష్ఠా ఆర్తాది భక్తిత్రయా పేక్షయా చతుర్థీ పరాభక్తి రుచ్యతే ఆర్తాదిభక్తిత్రయం కన్నా చతుర్ధమైన ఈ జ్ఞాన నిష్టారూపమైన భక్తి పరాభక్తి. ఇదే అన్నిటికన్నా శ్రేష్ఠమని వాక్రుచ్చారు. అంతేకాదు. “మద్భక్త ఏత ద్విజ్ఞాయ మద్భావా యోప పద్యతే” అనే శ్లోకార్ధాన్ని వ్యాఖ్యానిస్తూ “యత్పశ్యతి - యచ్ఛృణోతి స్పృశతివా తత్సర్వమ్ వాసుదేవ ఏవేతి ఏవం గ్రహావిష్ట బుద్ధిః మద్భక్తః” ఏది చూచినా ఏది విన్నా ఏది స్పృశించినా, ఇంతెందుకు ఏ ఇంద్రియంతో ఏది గ్రహించినా- అదంతా పరమాత్మ స్వరూపమే మరేదీ గాదనే దృఢభావన గలవాడే మద్భక్తుడనే మాటకర్థమని చెబుతారు. మోక్షసాధన సామగ్రామ్ భక్తి రేవగరీయసీ అని చెప్పి భక్తి అంటే ఏమిటని ప్రశ్న వేసుకొని సమాధాన మిచ్చారాయన. స్వస్వరూపాను సంధానమ్ భక్తి రత్యభి ధీయతే - సర్వత్రా తన ఆత్మచైతన్యాన్ని దర్శించటమే భక్తి అట. ఇదే అనన్యభక్తి అంటే. ఈ అనన్యభక్తి అంటే ఏదోగాదు జ్ఞానమే. జ్ఞానమే అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తూ పోతే అదే అనన్యభక్తి.
Page 182