#


Index

అనన్యభక్త

  “అత్రచ ప్రథమమ్ మహత్సేవా - తతస్తద్ధర్మ శ్రద్ధా తతో భగవత్కథా శ్రవణమ్ - తతో భగవతి రతిః తయాచ దేహద్వయ వివిక్తాత్మజ్ఞానమ్ తతోదృఢ భక్తిః తతో భగవత్తత్త్వ విజ్ఞానమ్ తత స్సర్వజ్ఞ త్వాది గుణావిర్భావః” ఇందులో ధర్మ శ్రద్ధ అంటే కర్మయోగం. దాని తరువాత చెప్పింది భగవద్రతి. అంటే భక్తియోగం. ఆ తరువాత దేహద్వయ వివిక్తాత్మ జ్ఞానం. అంటే జ్ఞానయోగం. ఆ పిమ్మట దృఢాభక్తిః అన్నాడు. దృఢభక్తి అంటే జ్ఞాన నిష్ఠలేక అనన్య భక్తి. కర్మయోగం భక్తియోగంలో పర్యవసిస్తే - భక్తి జ్ఞానంలో చేరిపోతే ఆ జ్ఞానం అనన్యభక్తిలో సమాప్తమవుతుందని సోపానక్రమాన్ని చెబుతున్నాడు. పోతే ఇక అనన్యభక్తి అనేది చిట్టచివరి భూమిక. దీనివల్ల కలిగేది ఒక భగవత్తత్త్వానుభవమే. అదే మోక్షం. అందులో సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వాది గుణాలు ముక్తుడి కప్రయత్నంగా సిద్ధిస్తాయి.

  అయితే ఇక్కడ ఒక ఆశంక కలగవచ్చు. మోక్షమనేది జ్ఞానం వల్ల ననిగదా వేదాంత శాస్త్రం ఘోషిస్తున్నది. అలాటి జ్ఞానాన్ని కూడా కాదని ఈ భక్తికి పట్టాభిషేకం చేయటమేమిటి. వాస్తవమే. జ్ఞానం వల్లనే ముక్తి. జ్ఞానాదేవతు కైవల్యమని శాస్త్రం చాటుతున్నది. సందేహంలేదు. కాని జ్ఞానమనేది ఒక్కసారి తళుక్కుమని మెరసినట్టు కలిగి ప్రయోజనం లేదు. దానివల్ల సర్వమూ ఆత్మేననే అనుభవముదయించినా అది అనుక్షణమూ నిలవకపోవచ్చు. నిలిస్తేగాని ముక్తిలేదు. దానికే జ్ఞాననిష్ఠ అని పేరు. ఈ జ్ఞాననిష్ఠనే భాగవతం అనన్యభక్తి అని వ్యవహరిస్తూంది. ఈ రహస్యం శ్రీధరుడే ఇలా విప్పి చెబుతున్నాడు మనకు. "సత్యమ్ జ్ఞాన మనంత మిత్యాది శ్రుతిభి రేవంభూతస్య భగవతః ప్రతిపాదనాత్ తద్ జ్ఞానమ్ సుకర మేవతి కుతో భక్త్యా" సత్యం జ్ఞాననమనంతం బ్రహ్మ అని వర్ణించే ఉపనిషద్వాక్యాల మూలంగా తత్తాదృశమైన భగవత్స్వరూపం ప్రతిపాదించబడి ఆ భగత్సంబంధి అయిన జ్ఞానం మనకు సులభంగా కలుగుతుంది గదా - ఇక భక్తితో మనకు నిమిత్తమేమిటి అని అడగవచ్చు. “అత ఆహ” దానికి సమాధానమిస్తున్నాము. "సత్యమేవమ్ భూత మాత్మానం శ్రుతయః ప్రతిపాదయంతి" నిజమే ఇలాంటి ఆత్మతత్త్వాన్ని శ్రుతులు ప్రతిపాదిస్తున్నాయి. కాదనటం లేదు. "అత్రచ యద్యపి వస్తునః” అపరోక్షం కాబట్టి అపరోక్షంగానే మనకు జ్ఞానమనేది కలిగి తీరుతుంది కూడా. “తథాపి అసంభావనా విపరీత భావనా తిరస్కృతత్వాత్" కలిగినప్పటికీ అసంభావన విపరీత భావన అనే

Page 181

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు