#


Index

అనన్యభక్త

వాసనా-అంతో ఇంతో ఉంటుంది. అది కూడా నా స్వరూపమే ననే అనన్య భావన పూర్తిగా ఉదయించదు. అంచేత అది సకైతవమే. పోతే మూడవదైన జ్ఞానయోగమే అకైతవం. అందులో అంతా స్వరూపమేననే సమ్యగ్దర్శనం కలుగుతుంది అంతవరకూ ఫరవాలేదు. ఎటువచ్చీ అది కలుగుతూ తొలుగుతూ పోతే సుఖం లేదు. కలిగినప్పుడు కాకపోయినా తొలగినప్పుడు మరలా అన్యభావన తొంగి చూస్తుంది. అంచేత ఈ కలిగిన జ్ఞానమే నిరంతరమూ అలాగే నిలిచి ఉండాలి. దీనికే అనన్యభక్తి అని పేరు. అనన్యభక్తి అంటే ఏదోగాదు. జ్ఞాననిష్ఠకే అది ఒకమారు పేరు. ఇదే భాగవత ధర్మం కూడా. సాక్షాత్తూ అప్పటికి సాధనమైన ధర్మమిదే.

  పోతే మిగతా మూడూ సాక్షాన్మోక్ష ప్రదాలు Direct కావు. అవి పరంపరా సాధనాలు Indirect అంటే అవి ఈ అనన్య భక్తికి యథాశక్తిగా దోహదం చేస్తే వాటిచేత పరిపుష్టమైన ఈ భక్తి ముక్తిని మనకు ప్రసాదిస్తుంది. అప్పుడన్నింటికి కలిసి ఒక ఏక వాక్యత ఏర్పడుతుంది. కర్మాదులకు అనన్యభక్తిలో వినియోగమైతే అనన్య భక్తికి మోక్షంలో పర్యవసానం. ఇదీ సమన్వయం. భాగవత మీ సమన్వయ రహస్యాన్ని కూడా మనకిలా బయట పెడుతున్నది.

“నసాధ యతి మామ్ ధర్మో - న సాంఖ్యమ్ యోగ ఉద్ధవ నస్వాధ్యాయ స్తపస్త్యాగో యథా భక్తి ర్మమోర్జితా”

  ధర్మమంటే కర్మానుష్ఠానం. సాంఖ్యమంటే కేవల శాస్త్రజ్ఞానం. యోగమనేది సమాధి లక్షణం. తపస్సు హఠయో గాదికం. ఇవి ఏవీ నన్ను పట్టుకోటానికి సాధనాలు కావంటాడు భగవాను డుద్దవుడితో. అయితే మరేది సాధనం. యథా భక్తిర్మ మోర్జితా. ఊర్జితమైన భక్తి ఒక్కటేనట. ఊర్జితమైన భక్తి అంటే అనన్య భక్తి. “సవై పుంసాం పరోధర్మో యతో భక్తి రధోక్షజే” అదే భాగవతం చెప్పే పరమధర్మం. మనం చేసే కర్మానుష్ఠానాదికం కాదిక్కడ ధర్మమంటే. "కర్మణా కర్మ నిర్హారో నహ్యత్యంతిక ఇష్యతే” కర్మల వల్ల కర్మ నిర్మూలనమెప్పటికీ జరగబోదు. తత్కర్మ హరి తోషం యత్ -హరి సంప్రీణ నార్థం చేసిందే కర్మ స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హ రితోషణమ్ భగవత్తోషణాని కుపయోగపడటమే కర్మకంతా ప్రయోజనం. అలాగే జ్ఞానం కూడా సావిద్యా తన్మతి ర్యయా - భగవదీయమైన బుద్ధే జ్ఞానమంటే. "శ్రుత మప్యౌ పనిషదమ్

Page 179

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు