కాని అవన్నీ మరణంతో మాసిపోయేవే. తజ్జయ సాధనాలు కావు. అలాంటి సాధనమొక్కటే. అది “సర్వాత్మా భగవాన్ హరిరీశ్వరః శ్రోతవ్యః” సర్వాత్మకమైన భగవత్తత్త్వాన్నే శ్రవణం చేసి అనుభవానికి తెచ్చుకోవాలి. అది సర్వాత్మకం కాబట్టి సర్వాత్మకుడివే అవుతావు నీవు. అప్పుడు నీకు మరణమే లేదంటాడు.
ఆదిలో ప్రతిజ్ఞారూపంగా చెప్పిన మాటే పన్నెండు స్కంధాల కథా భాగంలో సహేతుకంగా సోదాహరణంగా ప్రతిపాదించి మరలా భాగవతాంతంలో నిగమనం చేసి చూపుతాడు మహర్షి. "త్వమ్ తు రాజన్ మరిష్యేతి పశు బుద్ధి మిమాంజహి” రాజా ! నేను మరణిస్తానేమో అనేది పాశవమైన దృష్టి, అది వదలిపెట్టు. దేహవత్త్వమ్ న సంక్ష్యసి దేహం పోతుంది కాని నీవు పోవు. అహమ్ బ్రహ్మ పరంధామ బ్రహ్మాహం పరమం పదమ్ -నేనా బ్రహ్మాన్నే ఆ బ్రహ్మం నేనే అనే పరిపూర్ణ భావంతో ఉండు దశంతం తక్షకం నద్రక్ష్యసి తక్షకుడూ కనిపించడు - శరీరం చ - శరీరమూ కనిపించదు. విశ్వంచ పృథగాత్మనః ఈ విశ్వమూ నీకు వేరుగా కనిపించదు. ప్రపంచ శరీర పరమాత్మలు మూడూ ఆత్మకు భిన్నంగా కనిపించవు. ఆత్మగానే సాక్షాత్కరిస్తాయి. అప్పుడిక మరణమేముంది మానవుడికి. ఈ సర్వాత్మక దృష్టి నలవరుచుకోటమే మరణ తరణోపాయం. “ఏతత్తే కథితం తాత యదాత్మా పృష్టవాన్నృప" ఇదే గదా నీవడిగిన ప్రశ్న. దానికిది నేనిచ్చే సమాధానమని ఉపసంహరిస్తాడాయన. ఏ ఒక్కటీ మన ఆత్మచైతన్యానికి అన్యం కాదు. అంతా మన స్వరూపమే. తుదకు మరణం కూడా మన స్వరూపమే అనుకొన్నప్పుడిక మరణమెక్కడిది. అప్పటికి మోక్ష సాధనమనేది మానవుడికి మరేదీ గాదు. అనన్యభక్తి ఒక్కటేనని కంఠోక్తిగానే చాటుతున్నది భాగవతం.
ఈ అనన్య భక్తినే భాగవతం లోకానికి మోక్షసాధనంగా బోధిస్తున్నది. మోక్షం సత్యమైతే తత్సాధన రూపమైన ఈ భక్తి ధర్మం. భాగవత ధర్మమిదే. “ధర్మః ప్రోజ్ఝతకై తవోత్ర పరమః" అని ఆరంభంలోనే ఈ ధర్మాన్ని ప్రస్తావించింది. ఇది పరమమూ ప్రోజ్ఞితత కైతవము నని రెండు విశేషాలు వర్ణించి చెప్పింది దీనికి. పరమమంటే మిగతా మూడింటికంటే గొప్పది. ఎందువల్ల. ప్రోజ్జిత కైతవం గనుక. కైతవమంటే ఛలం-మిష, ఏదో కొంత నెపంపెట్టి చెప్పటం. అసలు తత్త్వం గాక మరేది వర్ణించినా అది దానికొక నెపమయి కూచుంటుంది. అది ఉన్నంతవరకూ అనన్యం కాదది. అన్యాపదేశమే. కర్మయోగంలో గాని, భక్తియోగంలో గాని ప్రపంచ వాసనా ఈశ్వర
Page 178