“విస్తార స్సర్వ భూతస్య - విష్ణోస్సర్వ మిదమ్ జగత్ ద్రష్టవ్య మాత్మ వత్తస్మా - దభేదేన విచక్షణైః”
అవ్యభిచారిణి అయిన భక్తి అన్నా అభేదమైన దర్శనమన్నా భాగవతం చెప్పే అనన్యభక్తికి మారుపేరే. ఇది జ్ఞాన నిష్టారూపమైనది. కాబట్టి మోక్షానికి సాక్షాత్సాధన మిది ఒక్కటే. మోక్షమంటే ఆత్మేతరమైన సకలోపాధుల నుంచీ బయట పడటమే గదా. అది అనన్య భక్తిలో తప్ప మరొక భూమికలో సాధ్యం కాదు. ఎందుకంటే మిగతా భూమికలలో ఆత్మకు భిన్నమైన నామరూపాలింకా కనపడుతుంటాయి. ఒకవేళ లేకపోయినా ఈశ్వరుడొక డెవడో ఉన్నాడనే భావమైనా ఉంటుంది. ఏ మాత్రమలాటి భేదభావన ఉన్నా ఆ మేరకు మోక్షం మనకు దూరమే. ద్వితీయా ద్వైభయమ్ భవతి అన్నారు. మనకు ద్వితీయమేది ఉన్నా అది మనకు బంధకమే. ద్వితీయమే అన్యం. ఈ అన్యదృష్టి లేశమాత్రమూ లేని దశ కాబట్టి అనన్యభక్తే మోక్ష సాధనం. పరీక్షిత్తు కోరింది శుకుడాయనకు ప్రసాదించింది కూడా ఇలాటి సాధనమే. ఇది మనకు భాగవత సమాప్తిలో వారిరువురి సంవాదంలోనే విశదమవుతుంది.
“అతః పృచ్ఛామి సంసిద్ధిమ్ - యోగినాం పరమం గురుం పురుష స్యేహ యత్కార్యమ్ మ్రియమాణస్య సర్వధా”
మర్త్యుడయి పుట్టిన ప్రతిఒక్కడూ ఎప్పుడో ఒకప్పుడు మరణించి తీరవలసిందే. అలా మరణమనేది తప్పనిసరి అయినప్పుడీ మానవుడు చేయవలసిన ప్రయత్నమేమిటి అని ప్రశ్నిస్తాడు పరీక్షిత్తు. పరీక్షిత్తు ప్రస్తుతం త్వరలోనే మరణించబోతున్నాడు. కాబట్టి అలాటి ప్రశ్నే వస్తున్నది నోట. ఎలాగూ మరణిస్తాడు గదా. ఇక ప్రశ్న దేనికి. అందుకే ప్రశ్న. మరణించి తీరవలసిందేనా. దాన్ని తప్పించుకొనే మార్గమే లేదా. లేకుంటే సరే అడిగేదే లేదు. ఉంటే మాత్రం అది ఏమిటో తెలుసుకోవలసిన బాధ్యత ప్రతిఒక్క మరణించే వ్యక్తికీ ఉందని దీని అంతరార్థం. కాగా శుకుడిచ్చే సమాధానమిది. “పరీయా నేషతే ప్రశ్నః కృతో లోకహితో నృప" నాయనా నీవడిగిన ప్రశ్న చాలా గొప్పది. ఇది నీకే గాదు. లోకులందరికీ కావలసిందే. అంటే మరణ రహస్యం తెలుసుకోవలసిన బాధ్యత అందరికీ ఉంది. ఏమిటా మరణ జయోపాయం. మానవుడి జీవిత కాలంలో తెలుసుకోవలసిన విషయాలు శత సహస్రమున్నాయి
Page 177