#


Index

అనన్యభక్త

7. అనన్యభక్తి

మన మింతవరకూ భగవదవతారములూ, వాటి ప్రయోజనమూ విశేషించి కృష్ణావతార తత్త్వమూ, ఈ విషయాలను గూర్చి చర్చించాము. కర్షణశీలుడే కృష్ణుడు. జీవుల నుద్ధరించటమే ఆకర్షణం. మన ఉత్తరణకే భగవంతు డసలవతరించింది. లేకుంటే ఆప్తకాముడైన భగవానుడికీ లోకంలోకి రావలసిన పని ఏముంది. 'నానవాప్తమ వాప్తవ్యమ్ - వర్త ఏవచ కర్మణి' అని గదా ఆయన సెలవిచ్చింది. నేను కోరవలసింది ఏదీ లేకపోయినా రాకపోకలు సాగిస్తూనే ఉన్నాను. పనులు చేస్తూనే ఉన్నానంటాడు. ఏమిటా పని. ముముక్షు జనోద్దరణమే. అది రెండు విధాలని పేర్కొన్నాము. ఒకటి ప్రతిలోమం. మరొకటి అనులోమం. దుష్టనిగ్రహం ద్వారా జరిగేది ప్రతిలోమం. పోతే శిష్టానుగ్రహ రూపమైనది అనులోమం. ఏమిటది. వారికి ముక్తిమార్గాన్ని బోధించటం. భగవానుడు బోధించే ఆ ముక్తి మార్గమే భక్తి. అనన్యభక్తి. మోక్షకాముడైన పరీక్షిత్తుకు శుకమహర్షి ఉపదేశించిన మార్గమదే.

  అయితే ఏమిటీ భక్తి అంటే. భజించటమే భక్తి. భజన, విభజన అని రెండు మాటలున్నాయి. భాషలో విభజన అంటే ఏమిటో తెలుసు మనకు విడిపోవటమని. విడిపోయిన వాడెవడో వాడు విభక్తుడు. మనమంతా ఆ భగవత్తత్త్వం నుంచి ఎప్పుడు విభక్తులమయి పోయామో మనకే తెలియదు. అలా విభక్తులం కావటం మూలాన్నే ఈ సంసార జంబాలంలో కంఠదఘ్నంగా మునిగి ఉక్కిరి బిక్కిరయి పోతున్నాము. మరలా ఏ జన్మకైనా దీనిలో నుంచి మనం బ్రతికి బయటపడాలంటే ఆ తత్త్వాన్ని మనం భజించాలి. భజిస్తే భక్తులమవుతాము. అంటే విడవకుండా ఆ పరమాత్మ నంటి పట్టుకొంటాము ఇదే భక్తి అనే మాటకర్థం. అంటి పట్టుకోటమాశ్రయించటం. అలా నిరంతరమూ దాన్నే పట్టుకొని కూచుంటే భ్రమర కీటన్యాయంగా అదే అవుతా డీజీవుడు. "బ్రహ్మవేద - బ్రహ్మైవ భవతి" అన్న దుపనిషత్తు. ఎందుకని. క్రొత్తగా కావటమయితే ఇది సందేహించవచ్చు - అవుతామా లేదా అని. అలా కాదిక్కడ వ్యవహారం. మొదటినుంచీ మనమా స్వరూపమే. మనపేరు మనం మరచిపోయినట్టు మన స్వరూపమైన ఆ తత్త్వానికే మనం దూరమయ్యాము. ఇప్పుడా జరిగిన పొరబాటు

Page 175

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు