#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

హరిపాద ద్వయభక్తి మీ వలన నిట్లా రూఢమై యొప్పునే తిరుగం బాఱదు చిత్తవృత్తి హరిపై దీపించి మీలోపలన్ ధరణీ దేవతలార మీరలు మహాధన్యుల్ సమస్తజ్ఞులున్ హరిచింతన్ మిముచెంద వెన్నడును జన్మాంత వ్యథా యోగముల్

  ధరణీ దేవతలిక్కడ శౌనకాది మహర్షులే. వారినే సంబోధించి చెబుతున్నాడు భాగవత ప్రచారకుడు సూతుడు. వారిద్వారా మనకందరికీ చేసే బోధ ఇది. భగవత్పాద ద్వయభక్తి ఉండాలి మొదట మనకు. హరిపాద ద్వయ మీ కనిపించే నామరూపాలే. "పద్యతే గమ్యతే ఇతిపాదః" అని పాద శబ్దానికి వ్యుత్పత్తి చెప్పారు భగవత్పాదులు. ఏది పరతత్త్వాన్ని చేరుస్తుదో అది పాదం. అవి ఈ నామరూపాలే. ఇవి ఆ పరమాత్మ సృస్టించినవే గనుక ఈ సృష్టిని పట్టుకొంటే ఆ స్రష్ట గుట్టు మనకు పట్టి ఇస్తాయి. అందుకే నేమో త్యాగ బ్రహ్మ “పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు - నీ నామరూపములకు నిత్య జయ మంగళ" మని గానం చేశాడు. పవమానసుతుడు పట్టిన పాదాలేవో కావు. నిజానికవి ఈ నామరూపాలే త్యాగయ్య దృష్టిలో. ఇదే జ్ఞానదృష్టి, ఈ దృష్టి ఆరూఢమై ఉండాలి. ఆ రూఢమైనందు కేమిటి దాఖలా. ఏది చూస్తున్నా, చేస్తున్నా నామరూపాత్మకంగా కాక భగవద్రూపంగా ప్రతి ఒక్కటీ దర్శనమివ్వాలి. అంటే ఇది ఫలానా, అది ఫలానా అని గాక ప్రతి ఒక్కటీ కేవలం అస్తిభాతి అని మాత్రమేచూడగలగాలి. అప్పుడిక చిత్తవృత్తులిన్ని లేవు. ఒకే ఒక అఖండాకార వృత్తిగా మారి ఎప్పటికీ అది ఇక చలించదు. మరొక విజాతీయ భావముంటే గదా చలించటానికంతా హరిమయమే అయిపోయింది. అలా అయిపోయిన జీవులే ధన్యులు. వారి జీవితమే ధన్యజీవితం. అంతేకాదు. నిరంతర హరిచింతన మూలంగా వారికిక జనన మరణాలనే ప్రసక్తే లేదు. నిత్యముక్తుడైన పరమాత్మలాగా వారు కూడా ముక్తులే అవుతారు. ఇదే భాగవత సందేశమసలు.

  ఉదాత్తమైన ఈ దివ్య సందేశమే అందిస్తున్నది మనకు కృష్ణావతార చరిత్ర. అర్ధమైన వాడికది అమృతం. కాని వాడికది హాలాహలం. కనుకనే భాగవతము తెలిసి పలుకట కష్టంబని చాటింది. భాగవతమంటే భగవత్తత్త్వమే. అది కృష్ణావతారంలో వ్యక్తమైనంతగా మరే అవతారంలోనూ కాలేదు. దాని నున్న దున్నట్టు

Page 173

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు