అలాంటి ఏకాత్మ భావనతో జీవించేవాడే ఎప్పటికైనా ఆ ఈశ్వరుడి కర్మ
మార్గాలేమిటో వాటిలో దాగి ఉన్న రహస్యమేమిటో తాను గ్రహించగలడు. మరొకరికి
వ్యాఖ్యానించి చెప్పగలడు. ఎలాటి కర్మ మార్గాలవి. అరవింద భవాదులు
బ్రహ్మేంద్రాదులకు కూడా తలమించిపోయినవి. వారికి కూడా దుర్లభమే.
అందరానంత ఎత్తులో ఉన్నాయి. ఉదంచితం. ఎంతో మించిపోయి ఉన్నాయి.
బ్రహ్మేంద్రాదులకు మించి ఉన్నాయనే విషయం కృష్ణుణ్ణి వంచించబోయి వారే
ఆయా సందర్భాలలో పరాభూతులు కావటమే మనకు నిదర్శనం. కాబట్టి
హేయోపాదేయ భేదం లేకుండా సకల సృష్టినీ ఈశ్వర లీలగా విభూతిగా దర్శించిన
వాడికే ఆయన తనజీవితంలో చేసిన చేష్టలు బోధపడతాయి. లేకుంటే వాటిలోని
ఆంతర్యం గ్రహించలేక ఇది రంకు అది బొంకు అని శిశుపాలాదుల మాదిరి
మనం కూడా ఈశ్వర దూషణ చేయటానికే ఉద్యుక్తులమవుతాము. ఇంతకూ
“యేయథా మాం ప్రపద్యంతే తాంస్త థైవ భజా మ్యహ” మన్నాడు భగవానుడే.
ఎవరే దృష్టితో చూస్తే వారికాయన అలాగే దర్శనమిస్తాడు. "అస న్నేవ స భవతి
అసద్య్రహ్మేతి వేదచేత్" లేడు లేడని వాదిస్తే వాడికాయన లేనేలేడు. అంతేకాదు.
ఉన్న తత్త్వానికేమీ హాని లేదు. వీడు లేదన్నా అది ఉండనే ఉంటుంది. కాని హాని
వీడికే. ఎందుకంటే ఉన్న దాన్ని వదిలేసి లేని ప్రపంచాన్ని పట్టుకొన్నాడు వీడు. ఇది
ఎప్పుడూ లేనిదే కాబట్టి దీన్నిపట్టుకొని ఊగులాడిన నేరానికి వీడూ లేకుండానే
పోతాడు. అలా కాక "అస్తి బ్రహ్మేతి చేద్వేద సంత మేనం తతో విదుః" ఎవడా
బ్రహ్మతత్త్వాన్ని విడవకుండా పట్టుకొన్నాడో వాడు దాని లాగానే ఎప్పటికీ ఉంటాడు.
"తస్యాహం నప్రణశ్యామి - సచమే నప్రణ శ్యతి" అని గదా భగవానుడి హామీ.
ఆయన వీడి దృష్టికి లేకుండా పోడు. కాబట్టి వీడూ ఆయన దృష్టికి లేకపోడు.
అంటే జనన మరణాలు లేని నిత్యస్థితిని పొందుతాడని భావం. ఇలాంటి బ్రాహ్మీ
స్థితిని సోదాహరణంగా కీర్తిస్తున్నాడు ప్రస్తుతమీ అయిదవ పద్యంలో.
అథేహ ధన్యా భగవంత ఇత్థామ్ యద్వాసు దేవే 2 ఖిల లోకనాథే కుర్వంతి సర్వాత్మక మాత్మ భావమ్ నయత్ర భూయః పరివర్త ఉగ్రః
Page 172