#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

ఇంచుక మాయలేక మదినెప్పుడు బాయని భక్తితోడవ ర్తించుచు నెవ్వడేని హరి దివ్య పదాంబుజ గంధ రాశిసే వించు - నత ండు గాంచు నర విందభ వాదులకైన దుర్లభో దంచితమైన యా హరి యుదార మహాద్భుత కర్మ మార్గముల్

  మాయ అంటే అజ్ఞానం. అజ్ఞానమనేది ఏ కొంచెమూ ఉండకూడదు. అంతా ఈశ్వరుడేనని సర్వాత్మభావం పూర్తిగా ఉండాలి. అది ఎప్పుడో మెరుపులాగా తళుక్కుమని మెరిసిపోయేదైతే లాభం లేదు మరలా. ఎప్పుడూ పాయకుండా ఉండాలి. ఇలాంటి జ్ఞాననిష్ఠకే భక్తి అని పేరు. అది కేవలం మదిలోనేగాక బాహ్య జీవితంలో కూడా ప్రతిఫలించాలి. అభ్యంతరంగా కలిగిన నిశ్చయజ్ఞానం బాహ్యంగా మనం నడుచుకొనే ప్రతినడతలోనూ కనిపించాలి. లోపలా, వెలపలా మనోవాక్కాయ వ్యాపారాలన్నీ తదాకారంగానే మారిపోవాలి. ఇదే వర్తించటమంటే. అలా వర్తించేవాడెవడైనా సరే. జాతి వర్ణ వయో లింగాది భేదం లేదిక. భగవత్తత్త్వాన్ని నిరంతరమూ అనుభవిస్తూనే ఉంటాడు. ఉంటాడంటే సన్న్యసించి ఎక్కడో ఏ అడవులకో కొండలకో పారిపోయి అక్కడ కూచుంటాడని కాదు. అక్కడికి పోయినా అదీ ఇలాటి సంసారమే. నామరూపాలెక్కడికి పోయినా కనిపిస్తూ ఉంటాయి. ఎటువచ్చీ అలా కనిపిస్తున్నా వాటినలా కనిపించే తీరులో చూడడు జ్ఞాని. మరెలా చూస్తాడు. ప్రతి ఒక్కటీ లోకంలో - పెండ్లాం బిడ్డలూ - ఇల్లూ వాకిలీ - అడవులూ కొండలూ - పట్టణాలూ ప్రజలూ-వ్యాపారాలూ వ్యవహారాలూ ఏది చూచినా అది ఆ ఈశ్వర విభూతిగానే అనుసంధించుకొంటాడు. ఆ హరి పదాంబుజ గంధ రాశే ఈ నామరూపాది కలాపమంతా. "పాదోస్య విశ్వాభూతాని" అని గదా శ్రుతి చెబుతున్నది. విశ్వమంతా దాని పాదం. అది ఒక అంబుజమే. "అప ఏవ ససర్జాదౌ” అని మొట్టమొదట సృష్టి అయిన పదార్థ మంబువులే. పంచభూతాలకూ అది ఉపలక్షణం. పోతే ఈ భూత పంచకం నుంచి జన్మించినవే ఈ చరాచర పదార్ధాలు. ఇవన్నీ ఆ పంచభూతాల గంధం లేదా వాసనలతో కూడినవే. ఇలాంటి భూతరాశినే నిరంతరమూ సేవిస్తుంటాడు జ్ఞాని. అంటే నామరూపాదులతోనే వ్యవహరిస్తుంటాడు. వ్యవహరిస్తున్నా అదంతా భగవద్విభూతిగానే భావిస్తూ దానితోనే ముడిపెట్టి తదాకారంగానే దర్శిస్తుంటాడు.

Page 171

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు