#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

చూడలేకపోతే వాడేమి మానవుడు. వాడిదేమి జ్ఞానం. ఇది ఎలాటిదంటే ఒక గొప్ప నర్తకుడుంటాడు. వాడెన్నో భంగిమలలో ఎన్నో నాట్యరీతులు ప్రదర్శిస్తుంటాడు. అలా ప్రదర్శిస్తుంటే వాటిలో ప్రతి ఒక్కటీ చూచి ఆహా ఎంత బాగా చేస్తున్నాడని అభినందించే శక్తి ఉండాలి ప్రేక్షకుడికి అలాటి యోగ్యతలేని పల్లెటూరి మొద్దుకేమనిపిస్తుంది. అవన్నీ శివమెత్తి ఆడే చిందులుగానూ, గంతులుగానూ భాసిస్తాయి. ఆ నర్తనమెంత చిత్ర విచిత్రంగా ఉన్నా అందులో ఎంత గొప్ప క్రమమున్నా వాడి బుద్ధికది అంతా అలికినట్టు ఒకటిగానే ఎంతో అవకతవకగానే కనిపిస్తుంది. అలాగే ఆ ఈశ్వరుడొక గొప్ప నర్తకుడు. ఆయన నర్తన మగణితమూ, సక్రమమూ అయిన నర్తన. అదే ఈ సృష్టి స్థితి లయాత్మకంగా సాగుతూన్న భువన వ్యవహారం. ఆ ఈశ్వరుడి భూమిక కెదిగి చూచి ప్రాజ్ఞుడైతే గ్రహించగలడు దీని ఆంతర్యం. అలా కాని మూఢుడికిది ఎలా బోధ పడుతుంది. మీదు మిక్కిలి ఇదంతా ఒక అర్ధం లేని హంగామాగా కనిపించి ఆక్షేపిస్తాడు. అలా ఆక్షేపించిన వారే రుక్మి శిశుపాల జరాసంధాదులు. దుర్యోధనాదులాయన విశ్వరూపం చూచి కూడా అది ఒక గారడీ పొమ్మన్నారు. వారెవరికీ బోధ పడలేదా తత్త్వం. విభూతి చూచి కూడా గ్రహించ లేకపోయాడు. అదే భీష్మవిదురాదులైన భాగవతులైతే ఆ జగన్నాటక సూత్రధారి నటించిన ప్రతి లీలా విశేషంలోనూ ఆయన విశ్వాతిగమైన సచ్చిత్స్వరూపాన్నే దర్శిస్తూ పోయారు.

  అయితే ఎప్పుడో వారెవరో దర్శించారని చెబితే ఏమి ప్రయోజనం. అది అప్పుడూ, ఇప్పుడూ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దర్శించగలిగి ఉండాలి. దర్శించగలిగితే ఇందరు నాస్తికులూ ఇందరు హేతువాదులూ ఎలా ఏర్పడగలిగారు. ఇప్పుడే గాదీ నాస్తికులు. అప్పుడూ ఆ రోజులలో కూడా ఉన్నట్టే చాటుతున్నది పురాణం. వారే గదా ఆయన ఈశ్వరత్వాన్ని అనుక్షణమూ అధిక్షేపిస్తూ వచ్చిన శిశుపాలాదులు. మరి ఇలాటి పరిస్థితిలో ఆ ఈశ్వరతత్త్వాన్ని అందుకొనే మార్గమేమిటి. అది మనకెలా లభిస్తుందని ప్రశ్న. చెబుతున్నాడు దానికి సమాధానం.

సవేద ధాతుః పదవీమ్ పరస్య దురంత వీర్యస్య రథాంగ పాణేః యో 2. మాయయా సంతతయా నువృత్త్యా భజేత తత్పాద సరోజ గంధమ్

Page 170

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు