#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

మరణం దాకా అన్నీ తెలిసే జరిపాడు. తానే అన్నాడు గదా అర్జునుడితో “వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున -భవిష్యాణిచ భూతాని మాంతు వేద నకశ్చన” అర్జునా ఆది మధ్యాంతాలు మూడూ కరతలామలకంగా నాకు తెలుసుగాని నన్నెవడూ తెలియడు సుమా.

  దీనికి తగినట్టే ఆయన జీవించి తమ మధ్య తిరుగుతున్నంతవరకూ తెలియలేదు. పాండవులకు. ఆయనా తమ బంధుకోటిలో ఒకడని భావించారు. మహా అయితే ఆపద్రక్షకుడైన ఒక మహానుభావుడని మాత్రమే వారాయన నర్థం చేసుకొన్నది. అంతకు మించి పరమాత్మ అనే జ్ఞానం వారికి కలగలేదు. అడపా దడపా కలిగినా అది అప్పటికప్పుడే మరలా మంచు పొరలాగే విరిసిపోతూ వచ్చింది. పోతే ఆయన జీవించి ఉండగా గ్రహించలేని రహస్యం వారాయన మరణానంతరం గ్రహించ గలిగారు. అర్జునుడు ద్వారకకు వచ్చి స్వామి వారిని వెతుక్కుంటూ పోతాడు. పోగా పోగా ఎక్కడో సాగర తీరాన దర్శనమిస్తుందాయన మృత కళేబరం. కృష్ణుని కళేబరం చూస్తానని కలలో కూడా అనుకొని ఉండ డర్జునుడు. దానిమీద పడి ఎంతగానో విలపిస్తాడు. ఎంత విలపిస్తే ఏముంది. అయిందేదో అయిపోయింది. ఇక జాగు చేస్తే సముద్రం ముంచి వేస్తుంది పట్టణాన్ని. దారుణమైన ఈ వార్త చెప్పకుండానే మభ్యపెట్టి అవరోధ జనాన్నంతా హస్తినకు తరలిస్తాడు. అడవి దారిలో దొంగలు వచ్చి మీద పడితే గాండీవముండి బాణాలుండి కూడా వారికి జవాబు చెప్పలేకపోతాడు. అప్పుడే గ్రహిస్తాడు మొదటినుంచీ తన గొప్ప ఏమీ లేదంతా ఆ ఈశ్వరుడిదే నని. నెమ్మదిగా అందరినీ రాజభవనం దగ్గరికి పట్టుకువచ్చి అక్కడ బయటపెట్టాడు మెల్లగా స్వామి వారి చావు కబురు. దుఃఖాక్రాంతలైన కాంతలంతా చితానలంలో దూకి పతి ననుగమిస్తారు. ఇదంతా ఏమిటీ ఘోరమని విస్తుపోయి చూస్తున్న ధర్మజునికి శ్రవశ్శూలాయ మానమైన వార్త చెవిన వేస్తాడు. “మన సారథి మనసచివుడు – మన వియ్యము మన సఖుండు మన బాంధవుడున్ మన విభుడు గురుడు దేవర - మనలను దిగనాడి చనియె" నని వాపోతాడు. మన మన అని మన మనుకోవలసిందే. ఆయన అనుకోలేదింతకూ. ఆయనకు మనలేదు. తనలేదు. అసలు తనువే లేదాయనకు రావటానికి. వచ్చినట్టు పోయినట్టు నటన. ఎందుకా నటన. “బలహీనాంగులకున్ బలాధికులకున్ ప్రత్యర్థి భావోద్యమంబులు కల్పించి

Page 163

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు