మహర్షులెవరో తన్ను దర్శించటానికి రావటమేమిటి. ఎవరో యాదవ కుమారులు చేసిన ఆగడానికి వారా వంశాన్నంతా శపించటమేమిటి. ఆ వంశమెవరిది. తనదే గదా. తన దర్శనార్ధం వచ్చినవారు తన వంశానికే ఎసరు పెట్టటమేమిటి. పెట్టినవారు వారైతే గదా. వారినెపంతో తానే పెట్టాడా ఎసరు. దానితో యాదవులంతా ఒక నలుసు మిగలకుండా తన కళ్ల ఎదుటనే చెల్లిపోయారు. ఇంకా ఒకరిద్దరు శేషించారని తెలిసి తానే వారిని నిశ్శేషం చేశాడు కూడా. తల్లిదండ్రులకు తానెక్కడికి వెళ్లేదీ చెప్పలేదు. అదేమంటే అర్జునుడికి కబురంపాను. వాడువచ్చి అన్నీ చూస్తాడని చెబుతాడు వారికి. షోడశ సహస్రాంతఃపుర కాంతలున్నారు. ఒక్కరికీ చెప్పలేదు. చివరకంత ప్రాణపదంగా భావించిన రుక్మిణికి గాని సత్యభామకు గాని ఒకరికీ తెలియదాయన ఎక్కడికి వెళ్లాడో. ఎక్కడికో ఏమో. మార్గమధ్యంలో బలరాముడనుజ్ఞ తీసుకొని వెళ్లిపోతాడు. యోగమార్గంలో శరీర త్యాగం చేసి ముందుగా పోయి ఆయనకు పానుపు సవరిస్తుంటాడు. దారుకుడు వచ్చి రథం తెస్తాను స్వామీ అంటే ఇంకా రథమేమిటి వెళ్లి పొమ్మంటే ఆ రథమూ దాని పరికరాలూ ఆకాశంలోకి ఎగిరిపోయి అంతర్ధానమవుతాయి. ఇంకా ముందు సాగిపోతుంటే అప్పుడెదురవుతాడు ఉద్దవుడు. ఎన్నాళ్ల నుంచి కనిపెట్టుకొని ఉన్నాడో ఏమో స్వామి ఏకాంతం కోసం. అది అయాచితంగా ఇప్పుడు లభించిందా మహానుభావుడికి. అడగవలసిందంతా అడిగాడాయనను. చెప్పవలసినదంతా చెప్పాడాయన. సెలవు తీసుకొని వెళ్లిపోయాడు.
ఇక జరగవలసిందేమిటి. ఒక్కటే. అది నిర్యాణం. ఇంతవరకూ అందరి నిర్యాణమూ జరిపాడు. ఇక తన నిర్యాణం తానే చూచుకోవలసి ఉంది. నిందలేనిది బొంది పోదని దానికొక బోయ నిమిత్తమయ్యాడు. సరిగా గురిచూచి ఆయన బొటనవ్రేలినే కొట్టాడు. దానికే వచ్చి తగిలింది బాణం. మహాపచారం మన్నించమని కాళ్లావేళ్లా పడ్డాడు. ఏది అపచారం ఏది ఉపచారం భగవానుడికి. ఆయన ప్రణాళికలో అది లేకపోతేగా వాణ్ణి తప్పు పట్టవలసింది. తెలియక వాడు కంగారు పడ్డాడంత మాత్రమే. స్వామివారి కది ఎప్పుడో తెలుసు. తెలిసే అది నిమిత్తంగా శరీరం వదిలేశాడు. తెలిసి వచ్చాడు. మరలా తెలిసి పోయాడు. ప్రతి ఒక్కటీ తెలియక చేయటానికి జీవుడు కాదు గదా. దేవుడాయె. దేవుడు గనుకనే జన్మ మొదలుకొని
Page 162